Share News

బోర్డు తిప్పేసిన స్క్రబ్‌ఎక్స్‌ కంపెనీ

ABN , Publish Date - Aug 12 , 2026 | 02:22 AM

పాత్రలు తోమే స్క్రబ్బర్‌ ప్యాడ్‌ల వ్యాపారం పేరుతో ప్రజలను నమ్మించి పెద్దమొత్తంలో నగదు వసూలు చేసిన స్క్రబ్‌ఎక్స్‌ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ ఘటన మంగళవారం మదనపల్లెలో ఆలస్యంగా వెలుగు చూసింది.

బోర్డు తిప్పేసిన స్క్రబ్‌ఎక్స్‌ కంపెనీ
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు, సీటీఎంరోడ్డులోని స్క్రబ్‌ఎక్స్‌ కార్యాలయం

జిల్లాలో 200మంది బాధితులు

రూ.2కోట్లకు పైగా నగదు వసూళ్లు

పరారీలో నిర్వాహకుడు..కేసు నమోదు

మదనపల్లె క్రైం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): పాత్రలు తోమే స్క్రబ్బర్‌ ప్యాడ్‌ల వ్యాపారం పేరుతో ప్రజలను నమ్మించి పెద్దమొత్తంలో నగదు వసూలు చేసిన స్క్రబ్‌ఎక్స్‌ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ ఘటన మంగళవారం మదనపల్లెలో ఆలస్యంగా వెలుగు చూసింది. టూటౌన్‌ పోలీసుల కథనం మేరకు..నెల్లూరుకు చెందిన రమేష్‌ అనే వ్యక్తి కొన్నిరోజుల కిందట మదనపల్లెలోని సీటీఎం రోడ్డులో స్క్రబ్‌ఎక్స్‌ సంస్థను ప్రారంభించాడు. అందులో సిబ్బందిని నియమించుకుని పాత్రలు తోమే స్క్రబ్బర్‌ ప్యాడ్‌ల తయారీ, ప్యాకింగ్‌, వ్యాపారం, అధిక లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంట్లోనే కూర్చొని స్క్రబ్‌ఎక్స్‌ ప్యాడ్‌ల తయారీ, వ్యాపారంతో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేశారు. తొలుత రూ.లక్ష కడితే నెలకు రూ.24వేలు జీతం ఇస్తామని ప్రకటించారు. ఈనేపథ్యంలో రూ.లక్ష కట్టిన వారికి ప్యాడ్‌లు తయారీ చేసే యంత్రాలు అందజేశారు. మెటీరియల్‌తో ప్యాడ్‌లు తయారు చేసిన వారికి నెలకు రూ.24వేలు చొప్పున మూడునెలలు వరుసగా వారి బ్యాంకు ఖాతాలకు జీతం డబ్బులు జమ చేశారు. దీంతోపాటు రూ.లక్ష కట్టిన వారు కంపెనీతో టైఅప్‌ అయినట్లు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఈ ప్రచారంతో మిగిలిన వారు ఆశపడి రూ.లక్ష చొప్పున 200మంది చెల్లించారు. అందులో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, బి.కొత్తకోట, ములకలచెరువు, పలమనేరు, తిరుపతి ప్రాంతాలకు చెందిన బాధితులు ఉన్నారు. తర్వాత ప్రొడక్ట్‌ తయారీకి సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. ఇటీవల కార్యాలయానికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. వారి అనుమానం మరింత బలమైంది. ఆరా తీయగా కంపెనీ సిబ్బంది నెలరోజుల క్రితమే తాళం వేసుకుని ఖాళీ చేసి వెళ్లిపోయారని స్థానికులు చెప్పారు. పైగా వారి సెల్‌ఫోన్లు స్విచ్ఛాప్‌ చేసి ఉండటంతో మోసపోయినట్లు తెలిసింది. దీంతో బాధితులు మంగళవారం టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించి సంస్థ మోసంపై ఫిర్యాదు చేశారు. ఈమేరకు నిర్వాహకుడు రమే్‌షపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. మిగతా సిబ్బందిపై కూడా కేసు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Aug 12 , 2026 | 02:22 AM