శాస్ర్తోక్తంగా అంకురార్పణ
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:50 AM
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్ర్తోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణ ప్రారంభానికి ముందు శ్రీవారి సేనాధిపతిగా పిలిచే విష్వక్సేనుడు ఆలయ మాడవీధుల్లో తిరుగుతూ స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
- నేటినుంచి శ్రీవారి వాహన సంబరం ఆరంభం
తిరుమల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్ర్తోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణ ప్రారంభానికి ముందు శ్రీవారి సేనాధిపతిగా పిలిచే విష్వక్సేనుడు ఆలయ మాడవీధుల్లో తిరుగుతూ స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. రాత్రి ఏడు గంటలకు విష్వక్సేనుడు.. గధతో తిరుచ్చి వాహనంపై ఆలయం నుంచి వెలుపలకు వచ్చాడు. మహద్వారం వద్ద హారతి అందుకుని నాలుగు మాడవీధుల్లో వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు. దీంతో వాహన సంబరం సోమవారం నుంచి ఆరంభం కానుంది. తొలి రోజున ఉదయం తిరుచ్చివాహనం, రాత్రి పెద్దశేష వాహనంలో స్వామివారు మాడవీధుల్లో దర్శనమివ్వనున్నారు.
కంకణ భట్టాచార్యులుగా ఏటీ రమేష్ దీక్షితులు
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు కంకణ భట్టాచార్యులుగా అర్చకుడు ఏటీ రమేష్ దీక్షితులు వ్యవహరించనున్నారు. ఈయన అంకురార్పణ నుంచి చక్రస్నానం వరకు వాహనసేవల్లో, యాగశాలలోని వైదిక కార్యక్రమాలు, ఇతర పూజల్లో ప్రధాన పాత్రపోషిస్తారు. ఉదయం, సాయంత్రం మడిని పాటిస్తూ నిత్యహోమాలు, ఇతర వైదిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.