బడి పిలుస్తోంది సక్సెస్
ABN , Publish Date - Jun 06 , 2026 | 01:03 AM
ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది చేపట్టిన బడిపిలుస్తోంది కార్యక్రమం విజయవంతమవుతోంది.
తిరుపతి రూరల్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది చేపట్టిన బడిపిలుస్తోంది కార్యక్రమం విజయవంతమవుతోంది. 36మండలాలు..36రోజులు ఇంటింటికీ బడిపిలుస్తోంది ప్రచార రథం పేరుతో తలపెట్టిన ఈ కార్యక్రమం మెరుగైన ఫలితాల దిశగా వెళుతోంది. ఏప్రిల్ 24న ప్రారంభమైన ఈ ప్రచార యాత్ర ప్రజాప్రతినిధులు,విద్యాశాఖ అధికారులు,టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని పెంచే విధంగా సాగుతోంది.ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం ఇప్పటికే 11,251మంది విద్యార్థులు నమోదు చేసుకోవడంతో విద్యాశాఖ ఉత్సాహంతో ముందుకు కదులుతోంది.మండలానికి ఒక్కో రోజు కేటాయించి ప్రత్యేక ప్రచార రథంతో ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలసి ప్రభుత్వ బడుల ప్రత్యేకతలను అధికారులు వివరిస్తున్నారు. మండల కేంద్రాల్లో డప్పు వాయిద్యాలతో,ప్రచార గీతాలతో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి ప్రభుత్వ విద్య ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు.కరపత్రాలు ముద్రించి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. ఈఏడాది టెన్త్ ఫలితాల్లో టాపర్లుగా నిలచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రచార రథంపై ఊరేగిస్తుండడం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో ఒకటోతరగతిలో 13,502మంది విద్యార్థుల చేరికను టార్గెట్‌గా నిర్దేశించుకోగా..ఇప్పటికే 11,251మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందడం విశేషం.పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి లక్ష్యాన్ని మించి అడ్మిషన్లు నమోదయ్యే అవకాశముందని డీఈవో కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రజాప్రతినిధులు, అధికారులు, టీచర్లు, ప్రజలు కలసి పనిచేస్తే ప్రభుత్వ విద్యను ఎలా బలోపేతం చేయవచ్చో అనే దానికి జిల్లాలోని బడుల్లో నమోదైన విద్యార్థుల ప్రవేశాలే నిదర్శనమన్నారు.