Share News

ప్రశాంతంగా సర్వదర్శనాలు

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:20 AM

తొలి మూడు రోజులూ టోకెన్లు ఉన్నవారికే వైకుంఠద్వార దర్శనాలకు అనుమతి ఉండడంతో, మూడోరోజున సర్వదర్శన భక్తులు తిరుమలకు పోటెత్తారు

ప్రశాంతంగా సర్వదర్శనాలు
అదనపు క్యూలలో ప్రతి వంద మీటర్ల మీటర్లకు బారికేడ్లు పెట్టి భక్తులను వదులుతున్న సిబ్బంది

తిరుమల, జనవరి 2(ఆంధ్రజ్యోతి): తొలి మూడు రోజులూ టోకెన్లు ఉన్నవారికే వైకుంఠద్వార దర్శనాలకు అనుమతి ఉండడంతో, మూడోరోజున సర్వదర్శన భక్తులు తిరుమలకు పోటెత్తారు. దూరప్రాంతాల నుంచి కాలినడకన వచ్చిన భక్తులు క్యూలైన్లలో కనిపించారు. దివ్యాంగులు సైతం రద్దీని లెక్కచేయకుండా స్వామి దర్శనానికి తరలివచ్చారు. దాదాపు రెండున్నర కిలోమీటర్ల క్యూలైన్లలో చలిని తట్టుకుంటూ గోవిందనామస్మరణలతో ముందుకు సాగారు. చిన్న ఆటంకం కూడా లేకుండా సాఫీగా దర్శనాలు సాగుతున్నాయి. టీటీడీ నెల ముందు నుంచే చేపట్టిన చర్యల ఫలితం కనిపిస్తోంది. క్యూలైన్ల వద్దకు పరుగులు కానీ, క్యూల్లో తోపులాటలుగానీ, అసహనంతో అరుపులు కానీ శుక్రవారం లేవు. నిజానికి శుక్రవారం తెల్లవారుజాము నుంచి మొదలు కావలసిన సర్వదర్శనాలు గురువారం రాత్రి నుంచే మొదలు కావడంతో వైకుంఠద్వార దర్శనాలు చేసుకున్న భక్తుల సంఖ్య పెరిగింది. టోకెన్ల కోసం ప్రయత్నించి విఫలమైన భక్తులందరూ 2వ తేదీన స్వామిని దర్శించుకోవాలనే కోరికతో గురువారం సాయంత్రం నుంచి తిరుమలకు పోటెత్తారు. సాయంత్రం 5 నుంచే రద్దీ పెరుగుతుండడాన్ని టీటీడీ అధికారులు గుర్తించారు. దీంతో భక్తులను క్యూలైన్లు, షెడ్లు, కంపార్టుమెంట్లలోకి ముందుగానే అనుమతించారు. రద్దీ పెరుగుతునే ఉన్న క్రమంలో గురువారం స్లాట్లు కలిగిన భక్తులకు 11.30లోపే దర్శనం చేయించేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు దాదాపు 4 వేల మంది సర్వదర్శన భక్తులకు దర్శనాలు చేయించారు. తిరిగి శుక్రవారం వేకువజాము నుంచి సర్వదర్శనాలు మొదలయ్యాయి. అభిషేకసేవ జరుగుతున్న సమయంలోనూ సర్వదర్శనాలను ఆపలేదు. దీంతో సామాన్య భక్తులకు అభిషేక సేవలో దర్శనభాగ్యం కలిగింది. ఉదయం రద్దీ తీవ్రంగా ఉండడంతో భక్తులను అక్కడక్కడ కూర్చోబెట్టి క్యూలో పంపారు. మధ్యాహ్నం తర్వాత రద్దీ తగ్గడంతో ఎక్కడా నిలబడే అవసరం లేకుండా నెమ్మదిగా భక్తులందరూ ముందుకు వెళ్లారు. క్యూలైన్ల మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేయడం, దఫాలు వారీగా అనుమతించడంతో ఎక్కడా తోపులాటలు కనిపించలేదు. ఇక, భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించింది. చలిని దృష్టిలో పెట్టుకుని అన్నప్రసాదాలు, పాలు వేడిగా అందజేసింది. ఇలా ఉండగా శనివారం జరగాల్సిన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో అఽధ్యయనోత్సవాలు జరుగుతున్న క్రమంలో ఈనిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది.

గోవిందమాల భక్తులు

సాధారణంగా గోవిందమాల ధరించే భక్తులు ఇరుముడితో వైకుంఠ ఏకాదశి లేదా ద్వాదశి రోజుల్లో దర్శించుకుంటారు. అయితే ఈఏడాది ఈడిప్‌ టోకెన్‌ విధానం తీసుకురావడంతో సర్వదర్శనాలు మొదలయ్యే రోజున శుక్రవారం వీరంతా భారీగా తిరుమలకు చేరుకున్నారు. ఈక్రమంలో గోవిందమాల భక్తులతో క్యూలైన్లు కళకళలాడాయి.

క్యూలైన్ల వద్దకు ఉచిత బస్సులు

సర్వదర్శనం క్యూలైన్‌లోకి ప్రవేశించాలనుకునే భక్తుల కోసం టీటీడీ ఉచిత బస్సులను విస్తృతంగా నడిపింది. సర్వదర్శన భక్తులు క్యూలైన్‌లోకి ప్రవేశించే బాటగంగమ్మ ఆలయం సర్కిల్‌ వరకు బస్సులు నడిపారు. దాదాపు 20 బస్సులను అందుబాటులో ఉంచారు.

నేడు, రేపు కీలకం

పక్కా ప్రణాళికలతో శుక్రవారం వైకుంఠద్వార దర్శనాలు ప్రశాంతంగానే సాగాయి. అయితే శని, ఆదివారాలు సెలవుదినాలు కావడంతో ఈరెండు రోజులు కీలకమని టీటీడీ భావిస్తోంది. వచ్చే భక్తుల సంఖ్యతో సంబంధం లేకుండా రానున్న 48 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ఇబ్బంది లేకుండా..

కొంత సమయం పట్టినా ఎక్కడా ఇబ్బంది లేకుండా స్వామి దర్శనం అద్భుతంగా జరిగింది. అవసరమైన అన్నపానీయాలు అందిస్తూ స్వామి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు టీటీడీ చక్కటి ఏర్పాట్లు చేయడం అభినందనీయం.

- హర్షిత, కదిరి

చక్కటి దర్శన లభించింది

ఎన్నో ఏళ్లుగా వైకుంఠ ద్వార దర్శనాలకు వస్తున్నా. ఈ ఏడాది జరిగినంత అద్భుతంగా గతంలో ఎన్నడూ స్వామి దర్శనం జరగలేదు. టీటీడీ అధికారులు ఈసారి పక్కాగా ఏర్పాట్లు చేపట్టడం అభినందనీయం.

- దుర్గారావు, కాకినాడ

Updated Date - Jan 03 , 2026 | 12:20 AM