Share News

సంక్రాంతి పల్లె

ABN , Publish Date - Jan 15 , 2026 | 02:05 AM

ఆ ఊరి పేరే సంక్రాంతి పల్లె. పేరుకు తగ్గట్టే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఊరూవాడా సందడి నెలకొంటుంది. ఇండ్ల ముంగిట ఆకర్షణీయమైన రంగవల్లులు, హరిదాసుల దీవెనలు, గంగిరెద్దులాటలు, కోళ్ళపందేలతో గ్రామం సందడిగా మారిపోతుంది.

 సంక్రాంతి పల్లె
పొంగళ్లు పెట్టి సంక్రాంతి పండుగను జరుపుకుంటున్న గ్రామస్తులు

గ్రామమంతా ఒక్కటై జరుపుకునే పెద్దపండుగ

బంగారుపాళ్యం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఆ ఊరి పేరే సంక్రాంతి పల్లె. పేరుకు తగ్గట్టే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఊరూవాడా సందడి నెలకొంటుంది. ఇండ్ల ముంగిట ఆకర్షణీయమైన రంగవల్లులు, హరిదాసుల దీవెనలు, గంగిరెద్దులాటలు, కోళ్ళపందేలతో గ్రామం సందడిగా మారిపోతుంది.బంగారుపాళ్యం మండలంలో వున్న ఈ పల్లెకు సంక్రాంతి పండుగ వచ్చిందంటే బయటిప్రాంతాల్లో స్థిరపడ్డ గ్రామస్తులు రెండ్రోజులకు ముందే చేరుకుంటారు. ఈ గ్రామానికి 300 సంవత్సరాల క్రితం కోడిపుంజులూరుగా పేరుండేది.అప్పట్లో ప్రతి ఇంట్లోనూ పందెం కోడిపుంజులుండేవని చెబుతుంటారు.కాలక్రమంలో జమీందార్ల పరిపాలనలో ఈ గ్రామానికి సంక్రాంతిపల్లె పేరు స్థిరపడింది. ఇప్పటికీ గ్రామంలో కోడి అనే ఇంటిపేరుతో సుమారు వంద కుటుంబాలున్నాయి.భోగి పండుగ రోజైన బుధవారం సామూహికంగా భోగి మంటలు వేసి ఐకమత్యాన్ని గ్రామస్తులు చాటారు.మహిళలు, పురుషులు కలసి గొబ్బిపాటలతో అడుగులేస్తారు. సంక్రాంతి రోజున ఇంట్లో పూర్వీకులకు దుస్తులు పెట్టి పూజిస్తారు. కనుమ రోజు పాడిపశువులకు పూజలు నిర్వహించి పురవీధుల్లో పరుగెత్తిస్తారు.గ్రామస్తులంతా సహపంక్తి భోజనాలు చేస్తారు. కాగా బుధవారం కోడి విద్యాసాగర్‌ గ్రామానికి చెందిన మహిళలకు ముగ్గులపోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కోడి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 15 , 2026 | 02:05 AM