Share News

అందరికీ ‘సంజీవని’

ABN , Publish Date - May 15 , 2026 | 12:58 AM

మన జిల్లాలో విజయవంతమైన ‘సంజీవని’ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ కేర్‌ కోఆర్డినేషన్‌- హెల్త్‌ కేర్‌ డెలివరీ సిస్టమ్‌’ అమలు కోసం మంత్రి మండలి గురువారం ఆమోదం తెలిపింది.

అందరికీ ‘సంజీవని’

జిల్లాలో విజయవంతమైన ప్రాజెక్టు.. ఇక కానుంది రాష్ట్రవ్యాప్తం

రూ.204.5 కోట్లతో అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం

చిత్తూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): మన జిల్లాలో విజయవంతమైన ‘సంజీవని’ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ కేర్‌ కోఆర్డినేషన్‌- హెల్త్‌ కేర్‌ డెలివరీ సిస్టమ్‌’ అమలు కోసం మంత్రి మండలి గురువారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అమలు కోసం తొలి ఏడాది రూ.149 కోట్లను వ్యయం చేయాలని నిర్ణయం తీసుకుంది.

అసలేంటీ సంజీవని ప్రాజెక్టు..

ఆరోగ్యాంధ్ర కల సాకారంలో భాగంగా.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన నాణ్యమైన వైద్య సేవల్ని అందించేందుకు సంజీవని ప్రాజెక్టును గతేడాది జూలై 3న సీఎం చంద్రబాబు కుప్పంలో ప్రారంభించారు. ప్రజలకు చేసిన వైద్య పరీక్షలు, వాడిన మందులు, ఆరోగ్య సమస్యలు, చికిత్స చేసిన వైద్యుడి పేరు.. వంటి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసి పేషంట్‌కు ఓ ఐడీ ఇస్తారు. ఇలా ఆరోగ్య సమాచారాన్ని క్రోడీకరించే కేంద్రాన్ని డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌ (సంజీవని) అంటారు.

కుప్పం, నారావారిపల్లెలో పైలెట్‌ ప్రాజెక్టుగా..

తొలి విడతగా కుప్పం నియోజకవర్గం, నారావారిపల్లెలోని 3.1 లక్షల మందికి డిజిటల్‌ హెల్త్‌ కార్డుల్ని సిద్ధం చేశారు. రెండో విడతలో చిత్తూరు జిల్లాలోని 20 లక్షల మంది ఆరోగ్య వివరాల్ని క్రోడీకరించారు. 12 రకాల ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. గర్భిణులు- శిశువుల సంరక్షణ, అంటువ్యాధులు, బీపీ, షుగర్‌, కంటి, ముక్కు, చెవి, గొంతు, మానసిక ఆరోగ్య సేవలతో వృద్ధుల సంరక్షణ ఇందులో భాగం. వర్చువల్‌ విధానంలో రోగులు వైద్యులతో సంప్రదిస్తున్నారు. జిల్లాలోని అన్నిరకాల 119 ఆరోగ్య కేంద్రాలను ఈ నెట్‌వర్కులోకి చేర్చారు.

జూలై నాటికి రాష్ట్ర వ్యాప్తం..

ఈ ఏడాది జూలై నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2086 ఆరోగ్య కేంద్రాల్లో దీన్ని అమలు చేసి, సుమారు 5.2 కోట్ల ప్రజలకు సేవలు అందించడమే భవిష్యత్తు ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళుతోంది.

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు సీఎం అభినందన

‘ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తిగత డిజిటల్‌ రికార్డులను రూపొందించడంలో చిత్తూరు జిల్లా బాగా పనిచేసింది. సంజీవని ప్రాజెక్టును అన్ని జిల్లాల్లోనూ సమర్థంగా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.’ అని మార్చిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సంజీవని గురించి ప్రజెంటేషన్‌ ఇచ్చిన కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.

రెండేళ్లకు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల వాటా...

ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా తొలి ఏడాది అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.149 కోట్లను వ్యయం చేమనుంది. ఇందులో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌/ నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ ద్వారా రూ.90 కోట్లను కేంద్రం కేటాయించనుండగా.. రూ.59 కోట్లను రాష్ట్ర బడ్జెట్‌ నుంచి ప్రభుత్వం భరించనుంది. అలాగే రెండో సంవత్సరం నిర్వహణ ఖర్చుల కోసం రూ.55.5 కోట్లు కేటాయించగా, అందులో నేషనల్‌ హెల్త్‌, ఆయుష్‌ మిషన్ల ద్వారా రూ.45.5 కోట్లను కేంద్రం ద్వారా.. రూ.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెచ్చించనున్నారు. ప్రాజెక్టు అమలు కోసం ఏజెన్సీ ఎంపికకు ఆర్‌ఎ్‌ఫపీ జారీ చేయడానికి కూడా మంత్రి మండలి అనుమతిచ్చింది.

Updated Date - May 15 , 2026 | 12:58 AM