సిమెంటు బస్తాలంటూ ... ఇసుక అక్రమ రవాణా!
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:34 AM
లారీలో సరుకేంటంటే.. సిమెంటని చెబుతాడు డ్రైవరు. బస్తా విప్పి చూస్తే ఇసుక ఉంటుంది. ఇలా.. సిమెంటు లోడు పేరిట ఎన్నాళ్లుగానో సాగుతున్న ఇసుక అక్రమ రవాణా మంగళవారం రాత్రి బయటపడింది.
చిత్తూరు అర్బన్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): లారీలో సరుకేంటంటే.. సిమెంటని చెబుతాడు డ్రైవరు. బస్తా విప్పి చూస్తే ఇసుక ఉంటుంది. ఇలా.. సిమెంటు లోడు పేరిట ఎన్నాళ్లుగానో సాగుతున్న ఇసుక అక్రమ రవాణా మంగళవారం రాత్రి బయటపడింది. అదెలాగంటే.. పూతలపట్టు మండలం వావిల్‌తోట వద్ద డంప్ నుంచి సిమెంటు బస్తాల్లా ఇసుకను సంచుల్లో నింపారు. ఈ బస్తాలను లారీకి లోడ్‌చేసి పైన పట్ట కట్టారు. ఇలా రెండు లారీలు మంగళవారం రాత్రి 11గంటలకు తమిళనాడుకు బయలుదేరాయి. రాత్రి 12 గంటలకు చిత్తూరు నగర శివారులోని రెడ్డిగుంట చెక్‌పోస్టు వద్దకు చేరుకుంది. రాత్రి గస్తీలో ఉన్న తాలూకా ఎస్‌ఐ, పోలీసులు ముందు వ చ్చిన లారీని ఆపగానే సిమెంటు లోడ్డు చెన్నైకు వెళుతోందని డ్రైవర్ చెప్పాడు. ఎస్‌ఐకి అనుమానం వచ్చి సిమెంటు బస్తాలను చూపించాలని అడిగినట్లు సమాచారం. లారీ డ్రైవర్, ఇంకో వ్యక్తి తటపటాయించడంతో వారిని కిందకు దింపి గట్టిగా మందలించారు. దాంతో వారు బస్తాలను విప్పి చూపించగా అందులో ఇసుక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో రెండు లారీలను గుడిపాల పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాజకీయ ఒత్తిళ్లతో బుధవారం రాత్రి వరకు కేసు న మోదు చేయలేదని సమాచారం.