Share News

తూకివాకం సోలార్‌ ప్రాజెక్టుకు మోక్షం

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:22 AM

ఆరేళ్లుగా ఆగిపోయిన తూకివాకం సోలార్‌ ప్లాంట్‌కు మోక్షం కలగనుంది. వైసీపీ హయాంలో 20 శాతం మిగులు పనులతో ఆగిపోయిన ప్లాంట్‌ పునరుద్దరణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.

తూకివాకం సోలార్‌ ప్రాజెక్టుకు మోక్షం

20 శాతం పనులతో ఆరేళ్లుగా నిలిచిపోయిన వైనం

పీపీపీ పద్ధతిలో ‘వైశాక’కు ప్రభుత్వం కేటాయింపు

ప్లాంట్‌ అందుబాటులోకి రావడంతో పాటు కార్పొరేషన్‌కు ఆదాయం

తిరుపతి- ఆంధ్రజ్యోతి : ఆరేళ్లుగా ఆగిపోయిన తూకివాకం సోలార్‌ ప్లాంట్‌కు మోక్షం కలగనుంది. వైసీపీ హయాంలో 20 శాతం మిగులు పనులతో ఆగిపోయిన ప్లాంట్‌ పునరుద్దరణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఎండీ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ మౌర్య చొరవతో ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. పీపీపీ పద్ధతిలో వైశాక సోలార్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు కేటాయించింది. ఆమేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వానికి ఎలాంటి అదనపు ఆర్థిక భారంలేకుండా ప్రాజెక్టు పునరుద్ధరణ, అభివృద్ధి, ఆపరేషన్‌, నిర్వహణ బాధ్యతలు 25 ఏళ్లపాటు వైశాక సోలార్‌దే. కార్పొరేషన్‌కు గుడ్‌విల్‌ కింద ప్రభుత్వం సూచించిన మొత్తాన్ని చెల్లించడంతో పాటు ఉత్తతయ్యే విద్యుత్‌లో 60 శాతం కార్పొరేషన్‌కు 40 శాతం వైశాక సంస్థకు అందేలా ఒప్పందం కుదిరినట్టు తెలిసింది.

రూ20కోట్ల ప్రాజెక్టు తిరిగి అందుబాటులోకి

గ్రీన్‌ ఎనర్జీ పద్దతుల్లో కనీసం 10శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని సౌరసంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు రూ20కోట్ల స్మార్ట్‌ సిటీ నిధులతో సోలార్‌ ప్లాంట్లను నెలకొల్పేందుకు రేణిగుంట సమీపంలోని తూకివాకం వద్ద 6 వాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ పనులు చేపట్టారు. 2021లోనే అందుబాటులోకి రావాల్సిన ప్రాజెక్టు నిధులులేమితో అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పటివరకు దాదాపు రూ16కోట్లు వెచ్చించినట్టు సమాచారం.

టీడీపీ హయాంలో పురుడుపోసుకున్న ప్రాజెక్టు

సోలార్‌ విద్యుత్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేకదృష్టి కనబరుస్తుంటారు. ఈక్రమంలో 2019, ఫిబ్రవరి నెలలో తిరుపతి నగర పాలక సంస్థ స్మార్ట్‌ సిటీ నిధులతో రేణిగుంట మండలం తూకివాకం వద్ద 30 ఎకరాల్లో ఆరు మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు గ్రౌండ్‌ మౌంటెడ్‌ సోలార్‌ ప్లాంట్‌ పనులు ప్రారంభించారు. హైదాదబాద్‌కు చెందిన నోవస్‌ గ్రీన్‌ ఎనర్జీ సేఫ్టీ లిమిటెడ్‌ సంస్థ 2020 నవంబరు వరకు 80శాతం పనులను పూర్తిచేసి వదిలేసింది. కాంట్రాక్టు సంస్థకు, కార్పొరేషన్‌కు సమన్వయ లోపంతో పాటు బిల్లులు చెల్లింపులో జాప్యం కారణంగానే పనులు నిలిచిపోయాయన్న విమర్శలు వినిపించాయి. మరో 20 శాతం పనులు పూర్తిచేస్తే నెలరోజుల్లోనే ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చేఅవకాశం ఉండేది.

పిచ్చిమొక్కలు, విరిగిన ప్యానెల్స్‌

తూకివాకం వద్ద మొత్తం 30 ఎకరాలకు గాను 27 ఎకరాల్లో 18,240 సోరాల్‌ ప్యానల్స్‌ అమర్చారు. అదే విధంగా విద్యుత్‌ ఉత్పత్తి కోసం సబ్‌స్టేషన్‌ కంట్రోల్‌ రూమ్‌ పనులు కూడా సగంలో ఆగిపోయాయి. పర్యవేక్షణలేక ప్యానల్స్‌ దెబ్బతినడంతో పాటు పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తూకివాకం సోలార్‌ ప్లాంట్‌పై సమీక్షించారు. కమిషనర్‌ మౌర్య ప్రభుత్వంకి నివేదించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్లాంట్‌ అందుబాటులోకి రావడంతో పాటు కార్పొరేషన్‌కు ఆదాయం సమకూరనుంది.

Updated Date - Feb 24 , 2026 | 01:23 AM