పల్లె ఓటర్లు.. పోటెత్తారు
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:00 AM
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు. చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. ముందస్తుగా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 177 పంచాయతీల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. 83.33 శాతం ఓటింగ్ నమోదైంది.
బైరెడ్డిపల్లెలో అత్యధికం.. వి.కోటలో అత్యల్పం
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు. చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. ముందస్తుగా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 177 పంచాయతీల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. 83.33 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా బైరెడ్డిపల్లె మండలంలో 85.94 శాతం, కుప్పంలో 85.31 శాతం నమోదు కాగా అత్యల్పంగా వి.కోటలో 80.59శాతం నమోదైంది. తొమ్మిది మండలాల పరిధిలో ఐదు పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 177 పంచాయతీల్లో ఎన్నికలకు 1581 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,11,159 మంది ఓటర్లకుగాను 3,42,612 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 1,70,950.. మహిళలు 1,71,662 మంది ఉన్నారు. పురుషుల కంటే 712 మంది మహిళలు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటింగ్‌లో పాల్గొనేందుకు గ్రామీణ ప్రజలు ఉత్సాహం చూపించారు. పుర, పరిషత్ ఎన్నికల కంటే పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య 28.06 శాతం పోలింగ్ జరగ్గా.. 10 గంటలకు 34.06, ఆ తర్వాత పుంజుకుంది. 11 గంటల ప్రాంతంలో పోలింగ్ శాతం 52.30కి పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 67.48, పోలింగ్ ముగిసే సమయానికి 83.33 శాతానికి చేరుకుంది.
ఉదయం ఎక్కువగా.. తర్వాత నెమ్మదించి!
కుప్పం, ఆంధ్రజ్యోతి: కుప్పం నియోజకవర్గంలో ఉదయం 9 గంటలదాకా క్యూలైన్లలో అధిక సంఖ్యలో ఓటర్లు కనిపించారు. ఆ తర్వాత పోలింగ్ శాతం నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. మళ్లీ 11.30 గంటల నుంచి అధిక సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు. వృద్ధులు, దివ్యాంగులు, దెబ్బలు తగిలి ఆపరేషన్లు చేసుకున్నవాళ్లు, కట్టు కట్టుకున్న వాళ్లూ సహాయకుల సాయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు. 2 గంటలనుంచి కౌంటింగ్ మొదలైంది. 3.30 గంటలనుంచే ఫలితాల ప్రకటన వెలువడడం ప్రారంభమైంది. ఈ సమయంలో కొన్ని పంచాయతీల కౌంటింగ్ కేంద్రాల వద్ద చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి.
మండలాల వారీగా పోలింగ్ వివరాలు
-------------------------------------------------------------------------------------
మండలం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు శాతం
-------------------------------------------------------------------------------------
బైరెడ్డిపల్లె 43,954 37,775 85.94
గంగవరం 43,116 35,669 82.73
గుడుపల్లె 35,539 30,187 84.94
కుప్పం 55,332 47,203 85,31
పలమనేరు 23,917 19,901 83,21
పెద్దపంజాణి 43,259 36,366 84.07
రామకుప్పం 46,019 37,561 81,62
శాంతిపురం 48,350 40,186 83.11
వి.కోట 71,673 57,764 80.59
------------------------------------------------------------------------------------
మొత్తం 4,11,159 3,42,612 83.33
------------------------------------------------------------------------------------
పల్లె పాలకులు వీరే
138 పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారుల గెలుపు
40కి పరిమితమైన వైసీపీ.. 4 చోట్ల ఫలితాలు జాప్యం
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పాలకులు ఎవరనేది తేలిపోయింది. గురువారం నాటి పోలింగులో ఓటరు అభ్యర్థుల తలరాతను రాసేశారు. పార్టీ గుర్తులతో జరిగిన పుర.. పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీలు హవా చూపిన విషయం తెలిసిందే. పార్టీల గుర్తులు లేకుండా జరిగిన ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 182 పంచాయతీల్లో తొలివిడత ఎన్నికలు నిర్వహించారు. వీటిలో ఐదు చోట్ల టీడీపీ సానుభూతిపరులు ఏకగ్రీవమయ్యారు. 177 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. గురువారం రాత్రి కడపటి సమాచారం మేరకు కుప్పం, రామకుప్పం మండలాల్లో రెండేసి పంచాయతీలు మినహా మిగిలిన 173 సర్పంచి స్థానాల ఫలితాలను ప్రకటించారు. వీటిలో టీడీపీ బలపరచిన అభ్యర్థులు 133 చోట్ల.. వైసీపీ సానుభూతిపరులు 40 చోట్ల గెలుపొందారు. ఏకగ్రీవాలతో కలుపుకొంటే టీడీపీ ఖాతాలో 138 సర్పంచి స్థానాలు చేరాయి. ఇక, వైసీపీకి సంబంధించి అత్యధికంగా శాంతిపురం, పెద్దపంజాణి మండలాల్లో 8 చొప్పున.. అత్యల్పంగా పలమనేరులో ఒక సర్పంచి స్థానాన్ని గెలుచుకుంది. 182 పంచాయతీలకుగాను ఏకగ్రీవాలు సహా 178 ఫలితాలు రాగా.. ఇందులో 90 మంది పురుషులు, 88 మంది మహిళలు సర్పంచులుగా గెలుపొందారు. కాగా, మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగానే.. రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు పెట్టారు. సర్పంచులు, వార్డు స్థానాల బ్యాలెట్లను వేరుచేసి.. కౌంటింగ్ చేపట్టారు. కొన్ని పంచాయతీల ఫలితాలను వెంటవెంటనే ప్రకటించగా.. చాలావరకు ఆలస్యమయ్యాయి. గురువారం రాత్రి అందిన సమాచారం మేరకు ఇంకా 4 చోట్ల ఫలితాలు రావాల్సి ఉంది.
వానగుట్టపల్లెలో వివాదం
కౌంటింగ్‌కు సంబంధించి కుప్పం మండలం వానగుట్టపల్లె పంచాయతీలో గురువారం సాయంత్రం టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఆ ప్రాంతంలోని తన కారును పక్కకు తీయాలని ఎన్నికల సిబ్బందిలో ఒకరు డ్రైవర్‌కు చెప్పారు. ఆ దాడిలో తనకు దెబ్బలు తగలతాయేమోనన్న ఆందోళనతో డ్రైవరు కారును వేగంగా ముందుకు పోనివ్వడంతో జంపనూరు గ్రామానికి చెందిన రాజేంద్రను ఢీకొనగా ఆయన మృతిచెందారు. దీంతో మృతుడి బంధువులు, గ్రామస్తులు ధర్నా చేశారు. ఈ గొడవ మినహా మిగిలిన చోట్ల కౌంటింగ్ ప్రశాంతంగా జరిగింది.
- కుప్పం, ఆంధ్రజ్యోతి