Share News

గ్రామీణ ప్రజలు విభేదాలను పక్కన పెట్టాలి

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:32 AM

గ్రామీణ ప్రాంత ప్రజలు విభేదాలను పక్కనపెట్టి కలసిమెలసి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక సూచించారు.

గ్రామీణ ప్రజలు విభేదాలను పక్కన పెట్టాలి
కక్షిదారులకు ఆర్థిక భరోసా ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్న జిల్లా జడ్జి అరుణ సారిక

చిత్తూరు లీగల్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత ప్రజలు విభేదాలను పక్కనపెట్టి కలసిమెలసి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజీమార్గమే రాజమార్గం అన్నారు. ప్రజలు క్షణికావేశానికి గురై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే గ్రామంలో అందరూ కూర్చొని తమ సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించుకోవాలని కోరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 30 బెంచీల ద్వారా లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సివిల్‌, క్రిమినల్‌తోపాటు పలు రకాల కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. అనంతరం ప్రమాద కేసులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను కక్షిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎల్‌ఎ్‌సఏ కార్యదర్శి భారతి, న్యాయమూర్తి శ్రీనివాసరావు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 12:32 AM