Share News

కాలువల నిర్మాణానికి రూ.82కోట్లు

ABN , Publish Date - Apr 07 , 2026 | 02:10 AM

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో కాలువల నిర్మాణానికి రూ.82 కోట్లను విడుదల చేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు.

కాలువల నిర్మాణానికి రూ.82కోట్లు
అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నారాయణ, పక్కన ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్‌, మురళీ మోహన్‌, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తదితరులు

చిత్తూరు అర్బన్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో కాలువల నిర్మాణానికి రూ.82 కోట్లను విడుదల చేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. సోమవారం చిత్తూరు పర్యటనకు విచ్చేసిన ఆయన నగరపాలక కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్నువేసి వసూళ్లు చేసుకుని ఆ చెత్తను అలాగే డంపింగ్‌ యార్డులో వదిలేసిందన్నారు. ఆ చెత్తను మే నెలాఖరులోగా రీ సైక్లింగ్‌ చేయాలని ఆదేశించామన్నారు. తిరుపతిలో వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ నిర్మాణం పూర్తికావచ్చిందన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే చిత్తూరులో ఉత్పత్తి అయ్యే రోజువారీ వ్యర్థాలను అక్కడికి తరలిస్తామన్నారు. చిత్తూరు కార్పొరేషన్‌కు అవసరమైన ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేసి డ్యాష్‌బోర్డు ద్వారా వాటి పనితీరును పర్యవేక్షిస్తామన్నారు. టౌన్‌ప్లానింగ్‌ నుంచి అనుమతులను వేగంగా ఇవ్వడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదాయంతో పాటు నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. రెవెన్యూ ట్యాక్స్‌ను వసూలు చేసి నగరపాలక ఖాతాల్లోనే పెట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ విఽధంగా చేయడంద్వారా నగరంలో అవసరమైన పనులను చేసుకునే అవకాశం అధికారులకే ఉంటుందన్నారు. కలెక్టర్‌, స్పెషలాఫీసర్‌ సుమిత్‌కుమార్‌ మాట్లాడుతూ నగరంలో రోడ్ల విస్తరణ పనులు జోరుగా జరుగుతున్నాయని, ఎస్టీపీ ప్లాంట్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మార్కెట్‌యార్డులో గుర్తించామన్నారు. అడవిపల్లె రిజర్వాయర్‌ పనులను మరో ఆరు నెలల్లో పూర్తి చేసి నగరానికి నీటిని తీసుకొస్తామన్నారు. అమృత్‌ పథకంలో తీసుకున్న రుణానికి సంబంధించి నగరపాలక సంస్థ ఏటా రూ.18కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తోందని, దాన్ని మినహాయిస్తే ఆ నిధులతో అభివృద్ధి పనులు చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ మాట్లాడుతూ... నగరంలో రోడ్ల విస్తరణ పనులకు అవసరమైన నిధులను మంజూరు చేయాలన్నారు. అభివృద్ధి పనులను మరింత వేగంగా చేసేందుకు మరిన్ని నిధులు ఇచ్చేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరారు. నగరపాలక ఉద్యోగుల స్థాయిని కార్పొరేషన్‌ స్థాయికి పెంచాలన్నారు. కమిషనర్‌ నరసింహప్రసాద్‌ మాట్లాడుతూ... బస్టాండ్‌ రోడ్డును మోడల్‌ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.75 కోట్లతో వీఽధి దీపాలు, డ్రైనేజీ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. రెవెన్యూ డిమాండ్‌లో 69 శాతం పన్నులు వసూలు చేసినట్లు వివరించారు.

ఆదాయం పెంచుకోవడం దృష్టి పెట్టండి

నగర, పురపాలక సంఘాలు ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రధానంగా టౌన్‌ప్లానింగ్‌ నుంచి అనుమతులను వేగవంతం చేయడం ద్వారా భవన నిర్మాణాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలను వృద్ధిచేసి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ ట్యాక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ట్యాక్స్‌ పరిఽధిలోకి రానివాటిని గుర్తించడం, తక్కువ ట్యాక్స్‌ చెల్లిస్తున్న వారిని గుర్తించి వసూళ్లు చేయాలన్నారు. గత ప్రభుత్వం మున్సిపల్‌ నిధులను పక్కదారి పట్టించిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీ ట్యాక్స్‌ మున్సిపల్‌ ఖాతాల్లోనే ఉండేలా గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రితో పాటు చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, మాజీ మేయర్‌ అముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌, మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ త్యాగరాజన్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ సుబ్రి, టీడీపీ నేత కాజూరు బాలాజీ, బీజేపీ నేతలు అట్లూరి శ్రీనివాసులు, రామభద్ర, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

పలు పనుల పరిశీలన

చిత్తూరు పర్యటనకు విచ్చేసిన మంత్రి నారాయణకు మురకంబట్టు వద్ద ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సంతపేటలోని డంపింగ్‌యార్డును మంత్రి పరిశీలించారు. వేస్ట్‌ ప్రాసెసింగ్‌ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంతపేట, కట్టమంచి, సాంబయ్యకండ్రిగ, కొంగారెడ్డిపల్లె, ఫారెస్టురోడ్డు, గిరింపేట, ఇరువారం, పలమనేరు రోడ్ల విస్తరణ పనులను పరిశీలించారు. పూణేపల్లె వద్ద టిడ్కో గృహాలను పరిశీలించారు.

Updated Date - Apr 07 , 2026 | 02:10 AM