Share News

నియోజకవర్గానికి రూ.45 కోట్లు

ABN , Publish Date - Mar 18 , 2026 | 01:43 AM

తిరుపతి అర్బన్‌, రూరల్‌లో 22ఏ భూములపై కమిటీ ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాలి ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీల సమావేశంలో సీఎం చంద్రబాబు

నియోజకవర్గానికి రూ.45 కోట్లు
జిల్లాలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

తిరుపతి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధికి మరింత శ్రమించాలని జిల్లా ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్‌ను, ఎస్పీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం రెండు విడతలుగా వారితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి నియోజకవర్గంలో అత్యవసరంగానూ, ప్రధానంగానూ చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం రూ.40 కోట్ల నుంచి రూ.45 కోట్ల చొప్పున నిదులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేలు పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలని, ప్రతికూలతలను, లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే కీలక నగరమైన తిరుపతి అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని నొక్కి చెప్పారు. తిరుపతి రూరల్‌ మండలంలోని పద్మావతీపురం, శ్రీనివాసపురం, అవిలాల, గాంధీపురం, సాయినగర్‌, లింగేశ్వరనగర్‌ తదితర ప్రాంతాల్లోనూ, అలాగే తిరుపతి అర్బన్‌లోని పలు ప్రాంతాల్లో 22ఏ జాబితాలోని భూముల్లో పెద్దఎత్తున ఇళ్ళు, భవనాలు నిర్మించిన విషయం తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ప్రజలు కట్టుకున్న ఇళ్లను రెగ్యులరైజ్‌చేసి ఆ భూములను నిషేధిత జాబితా నుంచీ తొలగించాలని కోరారు. తిరుపతి రూరల్‌, అర్బన్‌ మండలాల్లోని 22ఏ నిషేధిత జాబితాలో వున్న భూములపై కమిటీ వేసి అధ్యయనం చేయాలని, సాధ్యమైనంత వరకూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్య పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. అలాగే తిరుపతి రూరల్‌లోని దామినేడు భూముల విషయమై కూడా కమిటీ వేయాలని ఆదేశించారు. పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిని మరింత అభివృద్ధి చేయాలని, ఆ పట్టణ పరిసరాల్లో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దానికనుగుణంగా ఆ ప్రాంతంలో రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతున్నందున అక్కడ ప్రధానంగా రోడ్ల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో గత వరదలకు కూలిపోయిన ఆర్‌ అండ్‌ బీ వంతెనలను తిరిగి నిర్మించడంతో పాటు నియోజకవర్గంలో ఆర్‌ అండ్‌ బీ రోడ్ల అభివృద్ధి, చెరువుల అనుసంధానం పనులు చేపట్టాలని ఆదేశించారు. నగరి నియోజకవర్గం పారిశ్రామికంగా బాగా వెనుకబడి వుందని, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే అక్కడ కూడా రోడ్లు అభివృద్ధి పరచాలన్నారు. గూడూరు నియోజకవర్గంలో పెండింగ్‌లో వున్న ఆర్‌ అండ్‌ బీ వంతెనల నిర్మాణం పూర్తి చేయాలని, సూళ్ళురుపేట నియోజకవర్గం పులికాట్‌ సరస్సులో పూడిరాయి దొరువు వద్ద పూడుకుపోయిన సముద్ర ముఖ ద్వారాలను క్లియర్‌ చేసే పనులను త్వరగా మొదలుపెట్టాలని ఆదేశించారు.

రెండు విడతల్లో నాలుగు గంటల పాటు సీఎం సమీక్ష

ఉండవల్లిలోని సీఎం నివాసంలో సాయంత్రం 5.15 గంటలకు సమీక్షా సమావేశం ప్రారంభమై 6.45 గంటల వరకూ కొనసాగింది. తర్వాత హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కార్యక్రమానికి వెళ్ళిన సీఎం చంద్రబాబు తిరిగి వచ్చాక రాత్రి 8.15 గంటలకు మళ్ళీ సమావేశం ప్రారంభించి 10.40 వరకూ కొనసాగించారు. సమావేశంలో జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, ఇంటెలిజెన్స్‌ ఐజీ లడ్డా, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, గాలి భానుప్రకాష్‌, బొజ్జల సుధీర్‌రెడ్డి, విజయశ్రీ, పాశం సునీల్‌ కుమార్‌, కురుగొండ్ల రామకృష్ణ, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు. కాగా, సత్యవేడు నుంచి టీడీపీ ఇన్‌ఛార్జి కూరపాటి శంకర్‌రెడ్డి హాజరయ్యారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ మాత్రం సమావేశానికి రాలేదు.

Updated Date - Mar 18 , 2026 | 01:43 AM