3 నెలల్లో రూ.మూడు కోట్ల పనులు
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:39 AM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అండగా జానకారపల్లె ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అండగా జానకారపల్లె ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. స్థానికుల ఇబ్బందులను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కమిషనరు నరసింహప్రసాద్ తదితరులు శ్రద్ధగా విన్నారు. మూడు నెలల్లో.. రూ.3 కోట్లతో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
చిత్తూరు అర్బన్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగరపాలక సంస్థలోని 23వ వార్డు జానకారపల్లెలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’గా నినాదంతో సోమవారం నిర్వహించిన సదస్సు విజయవంతమైంది. ఏడాది కిందట నగరంలోని విజయలక్ష్మి కాలనీలో ముఖ చిత్రాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మార్చింది. సోమవారం నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కమిషనర్ నరసింహప్రసాద్, మేయర్ అముద, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత హాజరయ్యారు. జానకారపల్లెలోని అంబేడ్కర్‌నగర్, కాజూరు, టెలిఫోన్ కాలనీ, శంకరయ్యగుంట, జయనగర్‌కాలనీ ప్రాంతాల వాసులు లేవనెత్తిన పలు సమస్యలపై స్పందించారు. ప్రధానంగా మురుగునీటి కాలువలు, వీఽధి దీపాలు, సీసీ రోడ్లు, శ్మశానానికి ప్రహరీ, పింఛన్లు, కాలనీ ఇండ్లు, రోడ్డుకు రెండువైపులా డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కావాలని కోరారు. 23వ వార్డుతో పాటు రోడ్డు అభివృద్ధి కోసం రూ.3 కోట్ల విలువైన పనులను చేపట్టి మూడు నెలల్లోపు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే, కమిషనర్ ప్రకటించారు. చుడా ఆధ్వర్యంలో మురికివాడల అభివృద్ధికి రూ. 20 లక్షలను మంజూరు చేస్తానని చైర్‌పర్సన్ కఠారి హేమలత ప్రకటించారు. వీధి దీపాల వినతులను అక్కడికక్కడే కమిషనరు పరిష్కరించారు.టీడీపీ నేతలు మాపాక్షి వెంకటేశ్, షణ్ముగం, డిష్ సురేష్, అర్జునన్, శివ, మురుగేశ్, సీఎంఎం గోపి పాల్గొన్నారు.ఆంధ్రజ్యోతి తిరుపతి బ్రాంచి మేనేజర్ వి.సురే్‌షరెడ్డి సదస్సుకు అధ్యక్షత వహించగా ఎడిషన్ ఇన్‌చార్జి వి.సుధాకర బాబు, స్టాఫ్ రిపోర్టర్లు షేక్ కరీముల్లా, మనోహర రెడ్డి, డీసీఎం ఉమాపతి, సీనియర్ యాడ్ ఆఫీసర్ విద్యాసాగర్, ఏసీవో జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
నాలుగు వార్డులను దత్తత తీసుకుంటా
చిత్తూరు నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.వందల కోట్లను ఖర్చు చేశాం. 23వ వార్డుతో పాటు చుట్టు పక్కలున్న మరో మూడు వార్డులను దత్తత తీసుకుంటున్నా. ఈ నాలుగు వార్డుల్లో డ్రైనేజీ, వీధి దీపాలు, సిమెంటు రోడ్లు, నీటి సౌకర్యంతో పాటు వ్యక్తిగతంగా నా దృష్టికి వచ్చిన పింఛన్, గృహ నిర్మాణం వంటి సమస్యల పరిష్కారాకి కృషి చేస్తా. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం కోసమే న్యూట్రిన్ ఫ్యాక్టరీ కొన్నా. ప్రస్తుతం అక్కడ పనులు జరుగుతున్నాయి. మాల్స్ కట్టాక స్థానికంగా ఉండే వారిలో 80 శాతం మందికి ఇక్కడే ఉపాధి కల్పిస్తా. దర్గా నుంచి ఇరువారం వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన వెంటనే డ్రైనేజీతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి సుందరంగా తీర్చి దిద్దడానికి చర్యలు తీసుకుంటా. - ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్
సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
చాలా మంది 23వ డివిజన్ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలనూ ప్రస్తావించారు. ముఖ్యంగా వార్డు పరిధిలో మురుగునీటి కాలువలు, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణాలను త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం. కాలువల్లో మట్టి తీయడం.. కాలువ లేకపోవడంతో నీరు నిలిచిపోతోందని వచ్చిన వినతులపై వారం పది రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపుతాం.
- కమిషనర్ నరసింహ ప్రసాద్