Share News

వ్యవసాయ యాంత్రీకరణకు రూ.2.23 కోట్లు

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:20 AM

ఈఖరీఫ్‌ సీజన్‌కు ముందే రైతులకు సబ్సిడీపై యంత్రాలు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది.

 వ్యవసాయ యాంత్రీకరణకు రూ.2.23 కోట్లు

ఖరీఫ్‌ ముందే పరికరాల పంపిణీకి ఏర్పాట్టు

చిత్తూరు సెంట్రల్‌, ఏప్రిల్‌ 26(ఆంరఽధజ్యోతి): ఈఖరీఫ్‌ సీజన్‌కు ముందే రైతులకు సబ్సిడీపై యంత్రాలు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకోసం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ మురళి తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలోని 1,18,386 మంది రైతులు 1,78,262 ఎకరాల్లో 22 రకాల పంటల సాగు చేయనున్నారు. సాగు ఆధారంగా అవసరమైన పరికరాల వివరాలు సేకరించాలని మండల వ్యవసాయాధికారులను జిల్లా అధికారులు ఆదేశించారు. పిచికారీ, ట్రాక్టర్ల అనుసంధానానికి వినియోగించే పరికారాలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో నిధులు వెచ్చించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

గరిష్టంగా రూ.50 వేల రాయితీ

రైతుకు గరిష్టంగా రూ.50 వేల వరకు రాయితీ రూపంలో లబ్ధి కలుగుతుంది. పరికరాలపై ప్రభుత్వం 40 నుంచి 50 శాతం రాయితీ ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీ, సన్నకారు రైతులు, మహిళలకు 50 శాతం వరకు లభించనుంది. మిగిలిన రైతులకు 40 శాతం నుంచి గరిష్టంగా రూ.50 వేల వరకు ఇవ్వనున్నారు. గతేడాది యాంత్రీకరణలో లబ్ధి పొందిన రైతులు ఈ ఖరీఫ్‌ సీజన్‌లోని యాంత్రీకరణలో రాయితీ పొందడానికి అనర్హులు. బహిరంగ మార్కెట్‌లో వంద శాతం మొత్తం చెల్లించి వ్యవసాయ యంత్ర పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో రాయతీ పరికరాలపై డిమాండ్‌ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Updated Date - Apr 27 , 2026 | 01:20 AM