మున్సిపాలిటీల్లో మౌలిక వసతులకు రూ. 214 కోట్లు
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:38 AM
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సహా వెంకటగిరి, శ్రీకాళహస్తి, నాయుడుపేట, సూళ్ళూరుపేట, పుత్తూరు మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం రూ. 214 కోట్లు మంజూరు చేసింది.
నేడు సీఎం కుప్పం నుంచీ వర్చువల్‌గా శంకుస్థాపన
తిరుపతి నగర కార్పొరేషన్‌కు రూ. 106 కోట్లు...
తిరుపతి/తిరుపతి సిటీ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సహా వెంకటగిరి, శ్రీకాళహస్తి, నాయుడుపేట, సూళ్ళూరుపేట, పుత్తూరు మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం రూ. 214 కోట్లు మంజూరు చేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ కింద ఈ నిధులు కేటాయించింది. ఈ నిధులతో చేపట్టే మౌళిక సదుపాయాల అభివృద్ధి పనులకు నేడు కుప్పం నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.తిరుపతి నగరంలో సీసీ రోడ్లు, డివైడర్లు, వీధి దీపాలు, పార్కులను అభివృద్ధి పరచడం కోసం రూ. 106 కోట్లు మంజూరైంది. ఇందులో 53.14 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 61.37 కోట్లు కేటాయించారు. అలాగే పార్కులు, పచ్చదనాలకు సంబంధించిన ఐదు పనులకు రూ. 7.28 కోట్లు మంజూరైంది. నగరంలో 4 కిలోమీటర్ల మేర డివైడర్ల అభివృద్ధికి, అలాగే మొత్తం 57,200 వీధి దీపాల ఏర్పాటుకు రూ. 13.93 కోట్లు కేటాయించారు. ఇవన్నీ కలిపి రూ. 82.58 కోట్లు కాగా పన్నులు, ఇతర కేటాయింపుల కింద మరో రూ. 23.42 కోట్లు మంజూరయ్యాయి. మొత్తంగా కేటాయించిన రూ. 106 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్) విధానంలో పనులు చేపట్టనున్నారు. దాని ప్రకారం ఈ ప్రాజెక్టులో 40 శాతం అంటే రూ. 42 కోట్లు ప్రభుత్వం ముందుగా కాంట్రాక్ట్ సంస్థకు చెల్లిస్తుంది. ఈ నిధులను ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ ఫండ్స్ నుంచీ డీటీసీపీ ద్వారా ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. మిగతా 60 శాతం అంటే రూ. 64 కోట్లు కాంట్రాక్ట్ సంస్థ సొంతంగా పెట్టుబడి పెట్టాలి. పనులు పూర్తయ్యాక ఈ 60 శాతం నిధులను ప్రభుత్వం 10 ఏళ్ళ వ్యవధిలో 40 త్రైమాసిక వాయిదాల్లో తిరిగి చెల్లిస్తుంది. ప్రతి త్రైమాసికానికి రూ. 1.60 కోట్లు వంతున కాంట్రాక్ట్ సంస్థకు చెల్లిస్తుంది.జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో ఇదే తరహా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు మొత్తం రూ. 108 కోట్లు మంజూరైంది. మున్సిపాలిటీల వారీగా చూస్తే తిరుపతి తర్వాత శ్రీకాళహస్తికి అధికంగా రూ. 27 కోట్లు కేటాయించారు. నాయుడుపేటకు రూ. 21 కోట్లు మంజూరు కాగా పుత్తూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీలకు రూ. 20 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయి. తిరుపతిలో రూ. 106 కోట్లు, మిగతా ఐదు మున్సిపాలిటీల్లో రూ. 108 కోట్లు చొప్పున మొత్తం రూ. 214 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.