Share News

రాయలపురంలో మౌలిక వసతుల కోసం రూ1.60కోట్ల మంజూరు

ABN , Publish Date - Mar 15 , 2026 | 01:49 AM

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అండగా రాయలపురం పంచాయతీ ప్రజలు సమస్యలపై గళంవిప్పారు. తమ ముంగిటికొచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తాము పడుతున్న ఇబ్బందులను తీసుకెళ్లారు.శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు వాటిని పరిష్కరించి రాయలపురం రూపు మారుస్తామని నిర్దిష్టమైన హామీ ఇవ్వడంతో సంబరపడ్డారు.

రాయలపురంలో  మౌలిక వసతుల కోసం రూ1.60కోట్ల మంజూరు

స్థానికుల వినతులపై స్పందించిన ఎమ్మెల్యే, కలెక్టర్‌

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి విశేష స్పందన

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అండగా రాయలపురం పంచాయతీ ప్రజలు సమస్యలపై గళంవిప్పారు. తమ ముంగిటికొచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తాము పడుతున్న ఇబ్బందులను తీసుకెళ్లారు.శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు వాటిని పరిష్కరించి రాయలపురం రూపు మారుస్తామని నిర్దిష్టమైన హామీ ఇవ్వడంతో సంబరపడ్డారు.

చంద్రగిరి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):చంద్రగిరి మండలం రాయలపురం పంచాయతీలో ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ నినాదంతో శనివారం ఉదయం నిర్వహించిన సదస్సు విజయవంతమైంది.ఏడాది క్రితం ఈ కార్యక్రమం ద్వారానే తిరుపతిలోని జీవకోన ముఖచిత్రాన్ని ఆంధ్రజ్యోతి మార్చింది. ఈసారి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు, ఆర్డీవో రామ్మోహన్‌ హాజరయ్యారు. రాయలపురం వాసులు లేవనెత్తిన పలు సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా తాగునీరు, మురుగు కాల్వలు, శ్మశానం, వీధి దీపాల సమస్యలను స్థానికులు ప్రస్తావించారు. దాంతో రాయలపురం పంచాయతీలో మౌలిక వసతులకు కోసం రూ.1.60కోట్లను అప్పటికప్పుడే మంజూరు చేశారు.యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే, కలెక్టరు ఆదేశించారు. ‘ఆంధ్రజ్యోతి’ తిరుపతి బ్రాంచ్‌ మేనేజర్‌ సురేష్‌ రెడ్డి సదస్సుకు అధ్యక్షత వహించగా తహసీల్దార్‌ శివరామ సుబ్బయ్య, ఎంపీడీవో అమరనాథ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బాలకృష్ణమూర్తి, బీజేపీ మండల అధ్యక్షుడు మునిరాజ, సింగిల్‌ విండో చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ రెడ్డి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కొండూరు ప్రవీణ్‌ రాయల్‌, డిప్యూటీ ఎంపీడీవోలు చంద్రశేఖర రెడ్డి, వెంకటరత్నం, ఆంధ్రజ్యోతి ఎడిషన్‌ ఇన్‌చార్జి సుధాకర బాబు, బ్యూరో ఇంచార్జి శివప్రసాద్‌, స్టాఫ్‌ రిపోర్టర్లు నరేంద్ర, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

చాలా చేశాం.. ఇంకా చేస్తాం

‘రాయలపురంలో ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశాం. వెంకటంపల్లెలో కాలువలు పరిశీలించి, నిలిచిపోయిన మురుగు బయటకు పోవడానికి రూ.5లక్షలు ఖర్చు చేసి చర్యలు తీసుకున్నాం. చంద్రగిరిలో నీళ్లు వచ్చి నిలిచిపోతున్నాయి. ఈ సమస్యను తీరుస్తాం. స్వర్ణ చంద్రగిరి లక్ష్యంగా ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించాం. త్వరలోనే ఆ పనులు చేపడతాం. ప్రతి ఇంటికి సోలార్‌ కనెక్షన్‌ ఇస్తాం. రాయలపురంలో పశువైద్యశిబిరాలు వారానికి ఒకటి రెండు సార్లు నిర్వహిస్తాం. పాఠశాల స్థాయి పెంచడానికి చర్యలు తీసుకుంటాం. కొత్త భవనం నిర్మాణానికి ప్రస్తుతానికి నిధుల కొరత ఉంది. సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు ఈసారి సంక్రాంతికి వచ్చేలోపు స్వర్ణ చంద్రగిరిని సాధిస్తాం. మే, జూన్‌ నెలకంతా కొత్త పింఛన్లు ఇస్తాం, హౌసింగ్‌ మంజూరు చేస్తాం. వెంకటంపల్లెలోని పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలను నా సొంత నిధులతో నిర్మిస్తా. శ్మశాన సమస్యను తీరుస్తాం, మినరల్‌ వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తాం. గంజాయిని నియోజకవర్గంలో 90 శాతానికిపైగా అరికట్టాం. ఇంకా అక్కడక్కడా ఉంటోంది. ఎవరైనా గంజాయి మత్తుకు అలవాటు పడినవారుంటే నాకు చెప్పండి. నేనే వాళ్లతో మాట్లాడతా. ఆ అలవాటును మాన్పిస్తా. మద్యం, గంజాయి వంటి అలవాట్ల వల్ల మూత్రపిండాల వ్యాధుల బారినపడుతున్నారు. అంతేకానీ మరేదో సమస్య ఇక్కడ లేదు. టీటీడీలో స్థానికులకు ఉద్యోగావకాశాలకు కృషి చేస్తా.

- పులివర్తి నాని, ఎమ్మెల్యే

సత్వరమే పరిష్కరిస్తాం

రాయలపురం పంచాయతీ పరిధిలోని సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం. అవసరమైన నిధులూ వెంటనే మంజూరు చేస్తాం. ప్రధానంగా గోకులం షెడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ఈ ప్రాంతం పరిధిలో భాకరాపేట నుంచి రంగంపేట వరకు, ఐతేపల్లె నుంచి రంగంపేట వరకు, ఐతేపల్లి-పూడి రోడ్లు విస్తరణ పనులు చేయనున్నాం. నేండ్రగుంట రోడ్డును అభివృద్ధి పరుస్తాం. స్వర్ణముఖి నదిలో వరదల వల్ల వంతెనలు దెబ్బతిన్నాయి. వాటిని మరమ్మతులు చేయడానికి చర్యలు చేపట్టాం. స్వర్ణ నారావారిపల్లె తరహాలో స్వర్ణ చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి చేస్తాం. పాడి పరిశ్రమ, టూరిజం, పరిశ్రమల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ పనులన్నీ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం.

- వెంకటేశ్వర్‌, కలెక్టర్‌

ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం

చంద్రగిరి నా సొంత మండలం. ఎమ్మెల్యే నాని.. ఎంపీడీవో భవనం అడిగారు. రూ.2.5కోట్లు మంజూరు చేశాం. భవన నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.25లక్షలు మంజూరు చేశాం. దీంతో ఈ సమస్య తీరింది. మురుగు సమస్యను స్వయంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. వీధి దీపాలు, శ్మశాన సమస్యతోపాటు తదితర వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం.

- రవికుమార్‌ నాయుడు, జడ్పీ సీఈవో

Updated Date - Mar 15 , 2026 | 01:49 AM