బంగారు కడ్డీల పేరుతో రూ.15 లక్షల దోపిడీ
ABN , Publish Date - Feb 19 , 2026 | 01:41 AM
తక్కువ ధరకు బంగారు కడ్డీలు ఇస్తామని చెప్పి మట్టి, రాళ్లు చేతిలో పెట్టి రూ.15లక్షలు దోచుకెళ్లిన ఘటన చౌడేపల్లె మండలంలో బుధవారం చోటుచేసుకుంది.
చౌడేపల్లె, ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి): తక్కువ ధరకు బంగారు కడ్డీలు ఇస్తామని చెప్పి మట్టి, రాళ్లు చేతిలో పెట్టి రూ.15లక్షలు దోచుకెళ్లిన ఘటన చౌడేపల్లె మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ తాలుకా సాగర్ టౌన్‌కు చెందిన విజయ్ కుమారుడు రాజేష్ ట్యాక్సీ నడుపుకుంటు జీవిస్తున్నాడు. ఆతని ఇంటి సమీపంలో అద్దెకు ఉన్న ఓ జేసీబీ డ్రైవరు తనకు తెలిసిన వ్యక్తుల వద్ద 5 కిలోల బంగారు కడ్డీలు ఉన్నాయని, వారికి డబ్బులు అవసరం ఉందని తక్కువకే తీసిస్తానని నమ్మబలికాడు. కిలో బంగారు రూ.7 లక్షలకు ఇస్తారని ఆశ చూపాడు. కావాలంటే పరిక్షించుకోమని ఒక బంగారు కడ్డీని రాజేష్‌కు ఇచ్చాడు. రాజేష్ బంగారు అంగడిలో పరీక్ష చేయించగా ఒరిజనల్ బంగారమనే చెప్పారు. 5 కిలోల బంగారు మదనపల్లెలో ఇస్తామని, అడ్వాన్స్‌గా రూ.15 లక్షలు ఇవ్వాలని జేసీబీ డ్రైవర్ కోరాడు. రాజేష్ తన భార్యతో కలిసి రూ.15 లక్షల నగదు తీసుకుని మదనపల్లెకు వచ్చాడు. అయితే చిన్నారి హత్యాచారం ఘటన నేపథ్యంలో మదనపల్లెలో బందోబస్తు ఎక్కువగా ఉందని, చౌడేపల్లె-పుంగనూరు మార్గంలోని లద్దిగం వద్దకు రావాలని చెప్పడంతో అక్కడకు వెళ్లారు. దుండగులు 3 ద్విచక్ర వాహనాల్లో ఆరుగురు వచ్చారు. లద్దిగం సమీపంలోని చింతతోపు వద్ద రూ.15 లక్షలు తీసుకుని, అతనికి 2 కిలోల రాళ్లు, 3 కిలోల మట్టి ఇచ్చారు. పోలీసులు వెంబడిస్తున్నారని చెప్పి రాజేష్ వద్ద ఉన్న సెల్ ఫోన్ సైతం లాక్కుని అక్కడి నుంచి ద్విచక్ర వాహనాల్లో ఉడాయించారు. పోలీసులు వస్తున్నారనే భయంతో రాజేష్ కూడా హడావుడిగా పుంగనూరుకు కారులో వెళ్లారు. అక్కడ వారు ఇచ్చిన మూటలను విప్పి చూడగా రాళ్లు, మట్టి కనిపించడంతో అవాక్కయ్యారు. మోసపోయినట్లు గుర్తించి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివమొగ్గ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.