తలకోన ఆలయ అభివృద్ధికి రూ.14.10 కోట్లు మంజూరు
ABN , Publish Date - Apr 14 , 2026 | 01:36 AM
తలకోన సిద్దేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా మరమ్మతులు, పునరుద్దరణ పనులను చేపట్టడానికి రూ.14.10 కోట్లు విడుదల చేయడానికి టీటీడీని అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుపతి(టీటీడీ), ఏప్రిల్ 13 (ఆంరఽధజ్యోతి) : తలకోన సిద్దేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా మరమ్మతులు, పునరుద్దరణ పనులను చేపట్టడానికి రూ.14.10 కోట్లు విడుదల చేయడానికి టీటీడీని అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి రూ.18 కోట్లు మంజూరు చేయడానికి అనుమతిస్తూ గత ఏడాది జూలై 23న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ద్వారా దశలవారీగా పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొదటి విడతలో రూ.2 కోట్లతో పనులు చేపట్టడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. దీనికోసం అదనంగా రూ. 1.90 కోట్లకు అనుమతులు జారీ అయ్యాయి. ఇక మిగిలిన పనులు చేపట్టి పూర్తి చేయడానికి మిగిలిన రూ. 14.10 కోట్లు విడుదలకు అనుమతించాల్సిందిగా గత మార్చిలో టీటీడీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం మిగిలిన ఆలయ అభివృద్ధి, పునరుద్దరణ పనులను చేపట్టి పూర్తి చేయడానికి అవసరమైన రూ.14.10 కోట్లు విడుదల చేయడానికి అనుమతిస్తూ దేవదాయ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి డా. ఎం.హరిజవర్‌లాల్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
టీటీడీలో సమ్మెపై నిషేధం పొడిగింపు
టీటీడీలోని అత్యవసర విభాగాల్లో సమ్మెపై నిషేధాన్ని నవంబరు 23వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.గడువు మే 23వ తేదీతో ముగుస్తోన్న నేపథ్యంలో మే 24 నుంచి మరో ఆరు నెలలపాటు సమ్మె నిషేధాన్ని పొడిగించారు