Share News

బిల్లు పెట్టేందుకు రూ.13 వేల లంచం

ABN , Publish Date - Apr 18 , 2026 | 01:32 AM

ఏసీబీకి పట్టుబడ్డ సీనియర్‌ అసిస్టెంట్‌

బిల్లు పెట్టేందుకు రూ.13 వేల లంచం
నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద వివరాలు తెలియజేస్తున్న ఏసీబీ డీఎస్పీ

పలమనేరు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): పలమనేరులోని నీటిపారుదల శాఖ కార్యాలయంపై శుక్రవారం తిరుపతి ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో కాంట్రాక్టర్‌ ఈశ్వరప్ప నుంచి రూ.13 వేల లంచం తీసుకుంటూ సీనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ అబ్దుల్‌ రజాక్‌ పట్టుపడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపిన ప్రకారం.. 2018లో పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన ఈశ్వరప్ప నీరు-ప్రగతి పథకం కింద జట్టివాండ్లపల్లి కొత్త చెరువు కట్ట పనులు చేశారు. దీనికిగాను ఆయనకు రూ.5.94 లక్షలు రావాల్సి ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఐదేళ్లపాటు ఈ బిల్లు పెండింగ్‌లో ఉండిపోయింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019కి ముందు నీరు-ప్రగతి పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లింపుల కోసం నిర్ణయించింది. దీంతో ఈశ్వరప్ప తాను 2018లో చేసిన పనులకు సంబంధించి రూ.5.94 లక్షల బిల్లుల కోసం ఆరు నెలలుగా పలమనేరులోని నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. చివరకు ఈ బిల్లు పెట్టేందుకు సీనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ అబ్దుల్‌ రజాక్‌ రూ.15వేలు డిమాండు చేశాడు. తానంత ఇచ్చుకోలేనని, అప్పు చేసి చేపట్టిన పని బిల్లు రాక ఆర్థికంగా చితికి పోయానని ప్రాధేయ పడటంతో రూ. 13వేలు ఇస్తే బిల్లు పెడతానని చెప్పారు. ఇక లాభం లేదని ఈశ్వరప్ప.. తిరుపతి ఏసీబీ కార్యాలయానికి వెళ్లి తనగోడు చెప్పారు. దీనిపై స్పందించిన తిరుపతి ఏసీబీ ఇన్‌ఛార్జి డీఎస్పీ శుక్రవారం ఈశ్వరప్పకు రూ.13 వేలు ఇచ్చి అబ్దుల్‌ రజాక్‌కు అందజేయాలని సూచించారు. దీంతో ఈశ్వరప్ప పలమనేరు ఈఈ కార్యాలయంలో షేక్‌ అబ్దుల్‌ రజాక్‌కు రూ. 13వేలు ఇచ్చారు. కార్యాలయం వెలుపల వేచివున్న ఏసీబీ డీఎస్పీ సహా సీఐలు మల్లికార్జునరావు, విద్యాసాగర్‌, నరసింహారావు వెంటనే కార్యాలయం లోపలకు వెళ్లి షేక్‌ అబ్దుల్‌ రజాక్‌ తీసుకున్న రూ.13వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 01:32 AM