గోశాలల అభివృద్ధికి రూ.11.28 కోట్లు
ABN , Publish Date - Mar 14 , 2026 | 01:14 AM
గోశాలలలు మరింత మెరుగ్గా పనిచేసేందుకు, గోవుల సంఖ్యను మరింత పెంచేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సిఫార్సులను అధికారులు అమలు చేయనున్నారు.
- అవసరాల మేరకు గోవుల స్థాన మార్పిడి
- కమిటీ సిఫార్సులకు టీటీడీ ఆమోదం
తిరుపతి (టీటీడీ), మార్చి 13 (ఆంధ్రజ్యోతి): గోశాలలలు మరింత మెరుగ్గా పనిచేసేందుకు, గోవుల సంఖ్యను మరింత పెంచేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సిఫార్సులను అధికారులు అమలు చేయనున్నారు. ఇందుకోసం రూ.11.28 కోట్లు ఖర్చు చేయనున్నారు. గోసంఖ్యను పెంచేందుకు ఇతర అవసరాలకు గోవులను స్థాన మార్పిడి చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేసింది. గోశాలల మెరుగైన నిర్వహణకు అవసరమైన సిఫార్సులు చేయాలని పేర్కొంటూ గత ఏడాది అక్టోబరులో జ్యోతుల నెహ్రూ, ముని కోటేశ్వరరావు, జంగా కృష్ణమూర్తి, ఆనంద్‌సాయి, భానుప్రకా్‌షరెడ్డిలతో ఒక కమిటీని టీటీడీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు గత ఏడాది డిసెంబరులో గోశాలలను సందర్శించి ఈవోకు నివేదిక అందించారు.
నివేదికలో ఏముందంటే..
తిరుమలలో పాలు ఇచ్చే గోవుల పెంపుదలకు అవసరమైన కొత్త షెడ్ల నిర్మాణం చేయాలి. 8 ఎకరాల పరిధిలో పొదలు, రాళ్లను తొలగించాలి. తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాల పరిధిలో వరిగడ్డి, సైలేజీ నిల్వకు 12 ఎకరాలతోపాటు మరో 20 ఎకరాల్లో కొత్త షెడ్లను నిర్మించాలి. 12 ఎకరాలతోపాటు మరో వ్యవసాయ భూమిలో రెయిన్ గన్స్, అవసరమైన బోర్లు ఏర్పాటు చేయాలి. పలమనేరు గోశాల పరిధిలో ప్రస్తుతం ఉన్నవాటితోపాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న షెడ్లపై సోలార్ ప్యానెళ్లు పెట్టాలి. సీసీ కెమెరాల ఏర్పాటు, మేత సరఫరా కోసం ట్రాక్టర్‌తోపాటు పంట కోత చేసే యంత్రాలు అవసరం. ఇరిగేషన్, మేత ఉత్పత్తికి 30 ఎకరాలను అభివృద్ధి చేయాలి. వ్యవసాయ సాగు భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. వీటితోపాటు గోసంపద పెంచేందుకు గోవులను ఒక చోటు నుంచి మరో చోటుకు మార్పునకు అనుమతించాలి. తిరుపతి ఎస్వీగోసంరక్షణశాలలోని ఉత్పాదకతలేని / మిగులు గోవులను పలమనేరు ఎస్వీఐసీకి తరలించేందుకు అనుమతించాలి. ఉత్పాదక గోవులను పలమనేరు నుంచి తిరుపతికి మార్పు చేసేందుకు, తిరుమలలోని ఉత్పాదక, ఉత్పాదకత లేని గోవులను తిరుపతికి మార్పునకు చర్యలు తీసుకోవాలి. కమిటీ సిఫార్సులకు టీటీడీ పాలకమండలి ఆమోదించడంతో త్వరలోనే పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.