డ్రంకెన్ డ్రెవ్‌లో పట్టుబడితే రూ.పది వేలు
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:51 PM
మద్యం తాగి.. వాహనం నడుపుతూ పట్టుబడితే జరిమానా పది వేల రూపాయలు. కోర్టులు అంతేసి అపరాధం విధిస్తున్నా మందుబాబులు మాత్రం పట్టించుకోవడం లేదు
మద్యం తాగి.. వాహనం నడుపుతూ పట్టుబడితే జరిమానా పది వేల రూపాయలు. కోర్టులు అంతేసి అపరాధం విధిస్తున్నా మందుబాబులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకవైపు వేలాది రూపాయలు పోతున్నా.. మరోవైపు మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదాల బారిన పడితే కుటుంబం రోడ్డున పడుతోందనే విషయంపై పోలీసులు అవగాహన కలిపిస్తున్నా.. వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ‘మత్తు’ దిగడం లేదు. ఏటా పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ కేసులే దీనికి నిదర్శనం.
- చిత్తూరు అర్బన్, ఆంధ్రజ్యోతి
జిల్లా వ్యాప్తంగా మద్యం తాగి వాహనాలను నడిపేవారిపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. అన్ని విభాగాల పోలీసులు నెలలో నాలుగైదు రోజుల పాటు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆయా రోజుల్లో చిత్తూరులో సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు నిర్వహించే ఈ తనిఖీల్లో సరాసరిగా 15 నుంచి 20 మంది వరకు మందుబాబులు వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగానూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సాధారణంగా ద్విచక్రవాహనదారుడికి లైసెన్స్ లేకపోయినా.. హెల్మెట్ ధరించకపోయిన పోలీసులు ఫైన్‌లు వేస్తారు. మద్యం తాగి వాహనాలను నడిపి పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. 2023లో కొత్తగా ప్రభుత్వం అమెండ్‌మెంట్‌ను తీసుకొచ్చింది. ఈ అమెండ్‌మెంట్‌తో గతంలో మద్యం తాగి పట్టుబడితే రూ.2వేలు ఫైన్ వేసే వారు. కొత్త రూల్స్ వచ్చాక మోటారు వాహనాల చట్టం 185 ప్రకారం.. డ్రంకెన్ డ్రైవ్ కేసులో మొదటిసారి పట్టుబడితే రూ. 10వేలు జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధిస్తారు. రెండోసారి పట్టుబడితే రూ.15వేలు జరిమానా లేదా మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండూ విధించొచ్చు. ఇప్పటి వరకు కోర్టు విధించిన జరిమానాను చెల్లించకపోవడంతో ఓ వ్యక్తి జైలుకు వెళ్లగా.. ముగ్గురిని ఒక రోజంతా కోర్టు వద్ద నిలబడి ఉండే విధంగా జడ్జి ఆదేశాలు ఇచ్చారు. ఇలా రూ.పదేసి వేల చొప్పున జరిమానా విధిస్తున్నా.. మందుబాబులకు ‘కైపు’ తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ పలువురు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతూనే ఉన్నారు.
ఇదీ లెక్క
2024వ సంవత్సరంలో 787 మంది మందుబాబులు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారికి రూ.71.12 లక్షల జరిమానాను కోర్టు విధించింది. 2025లో 817 మంది పట్టుబడగా వారికి రూ.81.70 లక్షలు, 2026 జనవరి నుంచి మార్చినెల 25వ తేదీ వరకు 158 మంది పట్టుబడగా రూ.15.80 లక్షల వంతున కోర్టు జరిమానా విధించింది. ఇలా 1758 మంది నుంచి రూ.1.686 కోట్లను జరిమానా రూపంలో పోలీసు శాఖ వసులు చేసింది. ఈ మందుబాబులంతా తనిఖీల సమయంలో.. ఆయా ప్రాంతాల్లోనే పట్టుబడిన వారే. తనిఖీలు లేని రోజుల్లో.. ప్రాంతాల్లో మరెందరో మందుబాబులు వాహనాలు నడుపుతున్నారు.
అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్
మద్యం తాగి వాహనాలను నడిపే వారు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. మద్యం మత్తులో వేగంగా వెళ్లి ఎదురుగా వెళుతున్న వాహనాలను ఢీకొట్టడంతో పాటు నడిచివెళ్లేవారిపై దూసుకుపోతున్నారు. దాంతో వారి ప్రాణాలతో పాటు ఏ తప్పూ చేయని వారు మృత్యువాత పడుతున్నారు. మద్యం తాగి వాహనాలను నడిపి ప్రమాదాల్లో చనిపోతున్న వారి కుటుంబం రోడ్డున పడుతోంది. అంత వరకు ఏదో ఒక పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి ప్రమాదంలో వికలాంగుడిగా మారిపోతున్నారు. అప్పటి వరకు కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తికే కుటుంబ సభ్యులు సపర్యలు చేసే పరిస్థితి నెలకొంటోంది. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే భారీగా జరిమానాలు ఉంటాయని చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు హెచ్చరించారు. మద్యం తాగడం వల్ల ప్రమాదాల బారిన పడటమే కాకుండా, ఆరోగ్య సమస్యలూ వస్తాయని సూచించారు.
విచక్షణ కోల్పోతారు
మద్యం తాగిన వారు విచక్షణ కోల్పోతారు. అధికంగా మద్యం తాగిన వారికి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలిసినట్లే ఉంటుంది కానీ తెలియదు. ఆ సమయంలో ఎదుటివారిపై దాడికి దిగడం.. వాహనాలు నడిపేవారు నేరుగా ఎదురుగా ఉన్న వాహనాలు లేదా జనాలపైకి దూసుకుపోతారు. ఈ విధంగా పూర్తిగా విచక్షణ కోల్పోయి ఇలాంటి పనులు చేస్తుంటారు. మద్యం తాగే వారికి మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. రాత్రి మాట్లాడిన విషయాన్ని పగలు మర్చిపోతారు. కొన్నేళ్లపాటు మద్యం తాగేవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దాంతో ఏ పనులు చేయలేక క్షీణించిపోతారు.
- దినేష్, ప్రొఫెసర్, అపోలో యూనివర్సిటీ