నిండుకున్న రోటా వైరస్ వ్యాక్సిన్ నిల్వలు
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:27 AM
జిల్లాలో రోటా వైరస్ వ్యాక్సిన్ నిల్వలు నిండుకున్నాయి. ప్రధానంగా చిన్నారుల్లో ప్రబలే డయేరియా వ్యాధికి ఈ టీకా బాగా పనిచేస్తోందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు
తిరుపతి సెంట్రల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోటా వైరస్ వ్యాక్సిన్ నిల్వలు నిండుకున్నాయి. ప్రధానంగా చిన్నారుల్లో ప్రబలే డయేరియా వ్యాధికి ఈ టీకా బాగా పనిచేస్తోందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఏడాదిలోపు పిల్లల మరణాలకు దారితీసే నీళ్ల విరేచనాలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రోటా వైరస్ వ్యాక్సిన్‌ను అన్ని జిల్లాలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. పసి బిడ్డలకు 6, 10, 14 వారాల వయస్సులో ఒక సారి వంతున మూడు దఫాలుగా ప్రతి బుధవారం స్వర్ణ వార్డు, గ్రామ సచివాలయాలతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వేస్తారు. ఆ తర్వాత శనివారం సమీప గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో టీకా కోసం రాని వారిని గుర్తించి ఇళ్ల వద్దకు వెళ్లి వేస్తారు. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రిలోనూ రోటా వైరస్ వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోయాయి.
డిమాండ్ 10,000 డోసులు.. ఉన్నది 3,000 డోసులు
జిల్లాలో దాదాపు 10,000 డోసులు అవసరం ఉంది. అయితే అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో కేవలం 3000 డోసులు మాత్రమే స్టాక్ ఉన్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శాంతకుమారి తెలిపారు. వ్యాక్సిన్ పరిమాణం 4 మిల్లీల వయల్ ధరను ఔషధ తయారీ సంస్థలు జీఎస్టీతో కలిపి దాదాపు రూ.760 వరకు విక్రయిస్తున్నారు. ఈ ప్రకారం డోసు ధర రూ.350 వరకు ఉంటుంది. రోటా వైరస్ వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. డోసుకు రూ.900 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని పిల్లలు తల్లిదండ్రులు తెలిపారు. ఇంకొందరైతే డోసు రూ.1200 వరకు వసూలు చేస్తున్నారని వాపోయారు.ఈ విషయమై జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శాంతకుమారి మాట్లాడుతూ ప్రస్తుతం 3,000 డోసుల రోటా వైరస్ వ్యాక్సిన్ మాత్రమే స్టాకు ఉందని తెలిపారు.. జిల్లాకు 10,000 డోసుల అవసరం ఉందని, సరఫరాలో కొంతవరకు కొరత ఉందన్నారు. డిమాండ్ మేరకు స్టాకు తెప్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.