ఏళ్లతరబడి పాతుకుపోయారు
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:43 AM
శ్రీకాళహస్తీశ్వరాలయ పీఆర్వో కార్యాలయ వ్యవస్థ అక్రమార్కులకు అదునుగా మారిందన్న అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆలయంలోని అన్ని విభాగాలను దశలవారీగా ప్రక్షాళన చేశారు. అయితే పీఆర్వో కార్యాలయ వ్యవస్థలో మాత్రం వేళ్లూనుకునిపోయిన వైసీపీ అక్రమ వసూళ్ల విధానంపై దృష్టి సారించలేదు. ఏళ్ల తరబడి అక్కడే పాతుకుపోయిన కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నప్పటికీ అంతర్గత బదిలీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.2014 నుంచి 2019 వరకు పటిష్టమైన విధానాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆలయంలోని వ్యవస్థలన్నీ అవినీతిమయంగా మారిపోయాయి.
-అస్తవ్యస్తంగా ముక్కంటి పీఆర్వో వ్యవస్థ
- ఇంకా సిబ్బందిని వీడని వైసీపీ వాసనలు
శ్రీకాళహస్తి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయ పీఆర్వో కార్యాలయ వ్యవస్థ అక్రమార్కులకు అదునుగా మారిందన్న అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆలయంలోని అన్ని విభాగాలను దశలవారీగా ప్రక్షాళన చేశారు. అయితే పీఆర్వో కార్యాలయ వ్యవస్థలో మాత్రం వేళ్లూనుకునిపోయిన వైసీపీ అక్రమ వసూళ్ల విధానంపై దృష్టి సారించలేదు. ఏళ్ల తరబడి అక్కడే పాతుకుపోయిన కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నప్పటికీ అంతర్గత బదిలీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.2014 నుంచి 2019 వరకు పటిష్టమైన విధానాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆలయంలోని వ్యవస్థలన్నీ అవినీతిమయంగా మారిపోయాయి.వైసీపీ నాయకులు కొందరు తమ అనుచరులను ఉచిత సేవకుల పేరుతో పీఆర్వో కార్యాలయంలో నియమించి వైట్‌కాలర్ దళారీ వ్యవస్థకు రెడ్‌కార్పెట్ వేశారు. సుమారు 50మంది వైసీపీ సంబంధీకులు ఐదేళ్ల పాటు పీఆర్వో కార్యాలయంలో తిష్టవేసి బహిరంగ దర్శనాలకు బరితెగించారు. దీనిపై పలుమార్లు ఆంధ్రజ్యోతిలో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత క్యూలైన్లు, ఆన్‌లైన్ల టికెట్ల విధానం అమలు, అంతరాలయ దర్శన టికెట్ల విదానం ప్రవేశపెట్టడంతో దళారీ వ్యవస్థ తగ్గుముఖం పట్టింది. ఆలయంలోని పలు విభాగాల్లో పాతుకుపోయిన సిబ్బందిని కూడా బదిలీ చేశారు. కానీ పీఆర్వో కార్యాలయంలో పనిచేసే వారిని బదిలీ చేయలేదు. సుమారు 8ఏళ్ల నుంచి ఓ మాజీ ఎమ్మెల్యే బంధువునంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అక్కడే కొనసాగుతున్నాడు. ఇదే తరహాలో కొందరు ఏళ్ల తరబడి పీఆర్వో కార్యాలయ కొలువును వదలకుండా వేలాడుతున్నారు. వీరంతా వీఐపీలకు దర్శనాలు చేసే విధుల ముసుగులో తమకు అయినవారిని అక్రమంగా దర్శనాలకు తీసుకెళుతూ జేబులు నింపుకుంటున్నారన్న అభియోగాలున్నాయిఓ ఉద్యోగి తమ్ముడు ఇటీవల పీఆర్వో కార్యాలయంలో భక్తురాలితో పాటు ఆమె కొడుకుపై దాడి చేయడంతో తీవ్ర దుమారం రేగింది.అనఽధికారిక వ్యక్తులను కార్యాలయంలోకి సిబ్బంది అనుమతిస్తుండడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని విభాగాల్లో సిబ్బంది విధినిర్వహణపై నిర్దిష్టమైన కార్యకలాపాలున్నాయి. కానీ పీఆర్వో కార్యాలయ సిబ్బందికి మాత్రం స్వచ్ఛమైన విధి నిర్వహణ రికార్డు లేకపోవడంతో దర్శనాల దుర్వినియోగం బాహాటంగా సాగుతోంది.సిబ్బంది ఏయే వీఐపీలతో పాటు దర్శనాలకు వెళుతున్నారు... ఎంతమంది భక్తులతో ఎన్నిసార్లు అంతరాలయంలోకి అనుమతించారు అన్న వివరాలు రికార్డు కావడంలేదు. దీంతో వారు వీఐపీల ముసుగులో ఇష్టారాజ్యంగా అనధికారికంగా దర్శనాలకు వెళుతూనే ఉన్నారు. పీఆర్వో కార్యాలయంపై కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వ్యక్తమవడంతో ఆ విభాగానికి ఇన్‌ఛార్జిగా ఉన్న ఏఈవో మోహన్‌ను మంగళవారం ఈవో వెంకటేశులు బదిలీ చేశారు. అలాగే అన్నదానం నుంచి పీఆర్వో కార్యాలయ ఇన్‌ఛార్జిగా ఏఈవో లోకేష్‌రెడ్డిని నియమించారు. కొత్త ఇన్‌ఛార్జిగా నియమించిన ఏఈవో లోకేష్‌రెడ్డిపై కూడా గతంలో పలు అభియోగాలతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఉదంతాలున్నాయి. ఏడాది క్రితం కంచుగడప వద్ద పనిచేసిన ఆయన కొందరు భక్తులతో దురుసుగా ప్రవర్తించడంతో అన్నదానం విభాగానికి బదిలీ చేశారు.