Share News

బతికున్న బిడ్డకు కర్మక్రియలు

ABN , Publish Date - Feb 06 , 2026 | 01:40 AM

కని, పెంచిన బిడ్డ తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యారు. బతికుండగానే తమ కుమార్తె చిత్రపటానికి నివాళులర్పించి, కర్మక్రియలు జరిపారు.

బతికున్న బిడ్డకు కర్మక్రియలు
బిడ్డ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న తల్లిదండ్రులు

ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రుల ఆగ్రహం

శ్రీరంగరాజపురం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): కని, పెంచిన బిడ్డ తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యారు. బతికుండగానే తమ కుమార్తె చిత్రపటానికి నివాళులర్పించి, కర్మక్రియలు జరిపారు. ఈ ఘటన గురువారం శ్రీరంగరాజపురం మండలం పిళ్లారికుప్పంలో జరిగింది. ఉష, సుబ్రహ్మణ్యం రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌, రెండో కుమార్తె బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో రెండో కుమార్తె హేమప్రియ అదే గ్రామం.. తమ సామాజికవర్గానికే చెందిన కిశోర్‌ను ప్రేమించింది. ఈ విషయం తెలిసి సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించాలని యువకుడి తరపున బంధువులు కోరగా.. అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదని తెలిసింది. ఈ క్రమంలో బుధవారం హేమప్రియ, కిశోర్‌ పెళ్లి జరిగింది. తమ మాట వినకుండా ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు ఆవేదన.. ఆగ్రహం చెందారు. తమ కుమార్తె చనిపోయిందంటూ చిత్ర పటానికి పూలమాల వేసి గురువారం నివాళులర్పించారు. కర్మక్రియలు చేశారు. ఊరిలో జనాన్ని పిలిచి భోజనం పెట్టారు. కన్నబిడ్డ తమ కన్నీటికి కారకురాలు కావడంతో కలత చెంది కర్మక్రియలు చేసుకున్నామని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 01:40 AM