గ్రామీణ వైద్యంలో విప్లవం
ABN , Publish Date - May 24 , 2026 | 02:15 AM
గ్రామీణ ఆరోగ్య రంగంలో అత్యాధునిక సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. యాదమరిలోని సంజీవని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. పీహెచ్‌సీలో సంజీవని డిజిటల్ సేవలు, ఓపీ నమోదు, మందుల పంపిణీ దాకా పరిశీలించారు. పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ (పీసీసీ) డెస్క్ వద్ద జరిగే నమోదు ప్రక్రియను పరిశీలించారు. డిజిటల్ క్యూ మేనేజ్‌మెంట్, విజిట్ రికార్డులు, జనరేషన్, పేషెంట్ మ్యాపింగ్ విధానాన్ని సిబ్బంది సీఎంకు వివరించారు.
యాదమరి, మే 23 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఆరోగ్య రంగంలో అత్యాధునిక సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. యాదమరిలోని సంజీవని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. పీహెచ్‌సీలో సంజీవని డిజిటల్ సేవలు, ఓపీ నమోదు, మందుల పంపిణీ దాకా పరిశీలించారు. పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ (పీసీసీ) డెస్క్ వద్ద జరిగే నమోదు ప్రక్రియను పరిశీలించారు. డిజిటల్ క్యూ మేనేజ్‌మెంట్, విజిట్ రికార్డులు, జనరేషన్, పేషెంట్ మ్యాపింగ్ విధానాన్ని సిబ్బంది సీఎంకు వివరించారు. పీహెచ్‌సీలోని డ్యాష్ బోర్డులో ఉన్న రిజిస్ట్రేషన్లు, రోజువారి కన్సల్టేషన్లు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ట్రాకింగ్ సిస్టమ్‌ను పరిశీలించారు. స్టాఫ్ నర్స్ స్టేషన్‌ను సందర్శించి రోగుల బీపీ, ఎత్తు, బరువు, ఉష్ణోగ్రత, హార్ట్‌బీట్, పల్స్‌రేట్ వంటి వైటల్స్ డిజిటల్ పద్ధతిలో నమోదు చేయడాన్ని వీక్షించారు. సంజీవని ప్లాట్ ఫామ్‌లో ఏర్పాటు చేసిన ఏఐ అసిస్టెడ్ కన్సల్టేషన్ విధానాన్ని చంద్రబాబు తిలకించారు. నర్సులు రికార్డు చేసిన వైటల్స్‌ను తనిఖీ చేశారు. ఏఐ సపోర్టు, ఆటోమేటేడ్ డాక్యుమెంటేషన్‌ను అధికారులు లైవ్‌లో ప్రదర్శించారు. దీనివల్ల డాక్యుమెంటేషన్ భారం తగ్గి, రోగులపై ఎక్కువ శ్రద్ధ పెట్టేందుకు వీలవుతోందని సీఎంకు వైద్యులు వివరించారు. ఫార్మసీ విభాగంలో డిజిటల్ ప్రిస్ర్కిప్షన్ ఆధారంగా మందుల పంపిణీ తీరును చంద్రబాబు పరిశీలించారు. వర్చువల్ రూం నుంచి సంజీవని ప్లాట్‌ఫామ్ ద్వారా కుప్పం ఏరియా ఆస్పత్రి, బెంగళూరులోని టాటా ఎండీ, నిపుణులైన వైద్యులతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆస్పత్రిలో వైద్యసేవలపై రోగులు, వారి బంధువులతో మాట్లాడారు.
‘సంజీవని’తో ఆరోగ్యరంగంలో మార్పు: ఎంపీ
‘సంజీవని’ పథకం గ్రామీణ ఆరోగ్యరంగంలో పెద్ద మార్పు తెస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. యాదమరి మండలం 14 కండ్రిగలో శనివారం జరిగిన సంజీవని ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో గత 20 ఏళ్లలో జరగని విధంగా, కేవలం 23 నెలల్లో రికార్డుస్థాయి అభివృద్ధిని చేసి చూపించామని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పేర్కొన్నారు. ఈ అద్భుత ప్రగతికి సీఎం చంద్రబాబు అందిస్తున్న తోడ్పాటు, ఆయన విజన్ కారణమని కొనియాడారు. సంజీవని కార్యక్రమం ద్వారా టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ ఏర్పాటు చేశామని టాటా సంస్థ సీఈవో గిరీష్ కృష్ణమూర్తి తెలిపారు. సంజీవని కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందిస్తున్నామని కలెక్టర్ సుమిత్‌కుమార్ వివరించారు. సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ కాల్ సెంటర్ ద్వారా ఇప్పటివరకు 73 వేల మందికి హెల్త్ ఫాలోఅప్ నిర్వహించామన్నారు.