Share News

పండగ తర్వాత మన జిల్లాలోనూ రెవెన్యూ క్లినిక్‌లు

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:54 AM

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంక్రాంతి పండగ తర్వాత మన జిల్లాలోనూ రెవెన్యూ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే అమలవుతున్న పీజీఆర్‌ఎ్‌స(ప్రజా సమస్యల పరిష్కార వేదిక)కు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు.

పండగ తర్వాత మన జిల్లాలోనూ రెవెన్యూ క్లినిక్‌లు

- భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

- తొలుత కలెక్టరేట్‌లో ఏర్పాటు

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంక్రాంతి పండగ తర్వాత మన జిల్లాలోనూ రెవెన్యూ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే అమలవుతున్న పీజీఆర్‌ఎ్‌స(ప్రజా సమస్యల పరిష్కార వేదిక)కు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం విధి విధానాలను సూచిస్తూ సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేసింది.

రికార్డులతో సిద్ధం

క్లినిక్‌లో తహసీల్దార్లు, ఆర్డీవోలు, సిబ్బందితోపాటు అడంగళ్‌, 10-1 ఖాతాలు, ఎస్‌ఎ్‌ఫఎ(సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌), వెబ్‌ల్యాండ్‌, ఓఆర్‌సీఎంఎస్‌, తదితర రికార్డులు అందుబాటులో ఉంటాయి.

రిసెన్షన్‌

ప్రతి రెవెన్యూ క్లినిక్‌లోనూ రిసెన్షన్‌ ఉంటుంది. అర్జీదారుడిని కౌంటర్‌కు పిలిచి అతడినుంచి ప్రాథమిక వివరాలు, పత్రాలు తీసుకుంటారు. వాటిని నిర్దేశిత ఫార్మేట్‌లో నమోదు చేస్తారు.

సమస్యల వారీగా వర్గీకరణ

ఆర్‌వోఆర్‌, పట్టాదార్‌ పాసుపుస్తకం, ఆర్‌వోఎ్‌ఫఆర్‌, వన్‌-70 సంబంధించినవి, రీ సర్వే, ఇలాంటివి మొత్తం 14 రకాల సమస్యలుగా అర్జీలను వర్గీకరిస్తారు. వాటికి అనుగుణంగా 14 టేబుళ్లు, సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. సమస్య ఏ విభాగానికి సంబంధించిందో గుర్తించి అర్జీదారులను ఆ టేబుల్‌ వద్దకు పంపిస్తారు.

తహసీల్దార్‌తో మాట్లాడొచ్చు

అర్జీదారుడి నుంచి వివరాలు తీసుకున్నాక తహసీల్దార్‌తో మాట్లాడిస్తారు. సివిల్‌ వివాదాలైతే కోర్టుకెళ్లాలని సూచిస్తారు. తహసీల్దార్‌ కూడా వీఆర్వో, ఆర్‌ఐ, సర్వేయర్లతో మాట్లాడి సమాచారం తీసుకుంటారు.

పరిష్కారం దొరక్కపోతే క్షేత్రస్థాయికి..

సాధ్యమైనంత వరకు రెవెన్యూ క్లినిక్‌లలో అధికారుల వద్ద ఉండే ఫైళ్ల ఆధారంగా సమస్యను పరిష్కరిస్తారు. అలా పరిష్కరించలేనప్పుడే క్షేత్రస్థాయి విచారణకు ఆదేశిస్తారు. ఈ విషయాన్ని ఏటీటీ (యాక్షన్‌ టేకన్‌ రిపోర్టు)లో నమోదు చేస్తారు. వీఆర్వో, సర్వేయర్‌, ఆర్‌ఐ అందుకు అనుగుణంగా విచారణ లేదా సర్వేచేసి ఫొటోలు తీసి నివేదికలను సమర్పిస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు

ఆర్‌వోఆర్‌ కేసుల్లో అప్పీల్‌ అవసరమైతే తహసీల్దార్‌, ఆర్డీవోలు స్పందిస్తారు. ఓఆర్‌సీఎంఎస్‌ ద్వారా అప్పీల్‌చేసి సంబంధిత పక్షాలకు నోటీసు ఇస్తారు. మ్యుటేషన్‌, ఎఫ్‌ఎంసీ, వన్‌బీ తదితర సేవలైతే సేవాకౌంటర్‌కు అర్జీదారుడిని పంపి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయిస్తారు. రెవెన్యూ క్లినిక్‌ ఏటీటీ జత చేస్తారు.

తొలుత చిత్తూరులో..

రెవెన్యూ క్లినిక్‌లను చిత్తూరుతోపాటు మిగిలిన రెవెన్యూ డివిజన్లలో ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ఈనెల తొమ్మిదో తేదీవరకు కొనసాగుతున్న దృష్ట్యా రెవెన్యూ సిబ్బంది పూర్తిగా ఇందులో నిమగ్నమై ఉన్నారు. సంక్రాంతి తర్వాత జిల్లా కేంద్రంలో ప్రయోగాత్మకంగా ఏడెనిమిది మండలాలతో కలిపి కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత మిగిలిన రెవెన్యూ కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Jan 05 , 2026 | 01:54 AM