సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ, రీ సర్వే
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:41 AM
రెవెన్యూ, రీసర్వే సమస్యల పరిష్కారమే లక్ష్యమని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు.
గుడిపాల, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ, రీసర్వే సమస్యల పరిష్కారమే లక్ష్యమని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ‘ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు’ కార్యక్రమాన్ని జిల్లాస్థాయిలో తొలుతగా శుక్రవారం గుడిపాలలో ప్రారంభించారు. జడ్పీ హైస్కూల్ ఆవరణలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మ్యుటేషన్లు, జాయింట్ ఎల్‌పీఎం, సర్వే కరెక్షన్లు, మ్యాప్‌లైన్ కరెక్షన్లు, దారి వివాదాలు వంటి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. రీసర్వే ప్రక్రియకు సంబంధించిన ఫిర్యాదులు కొన్ని గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్నాయని, ఒకట్రెండు నెలల్లో వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. రీసర్వే జరగబోయే గ్రామాల్లో ప్రత్యేక అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు తమ లాగిన్‌లలో ఉన్న అధికారాలను సమర్థంగా వినియోగించి మ్యుటేషన్లు, రికార్డు నవీకరణ వంటి ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు. ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపే రీసర్వే విషయంలో పొరపాట్లు జరిగితే ఏళ్లపాటు ఫిర్యాదులు కొనసాగుతాయని హెచ్చరించారు. పరిష్కారం సాధ్యంకాని కుటుంబ విభజన, సరిహద్దు వివాదాలు వంటి అంశాల్లో సంబంధిత పక్షాలకు సూచనలు అందించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు. మరో 15 రోజుల తర్వాత మళ్లీ మండల స్థాయిలో గ్రీవెన్సు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అధికారులు సమర్థంగా పనిచేసి ప్రజా ఫిర్యాదుల సంఖ్యను తగ్గించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడటం, సమస్యల్లేని గ్రామాలుగా తీర్చిదిద్దడం, ప్రజల ఫిర్యాదుల పరిష్కారసేవలను వారి ఇంటి వద్దకే చేర్చడం, పీజీఆర్‌ఎ్‌సలో వినతులు, ఫిర్యాదులను నెల వ్యవధిలోనే పరిష్కరించడం, కోర్టు వివాదాలను తగ్గించడం, ప్రభుత్వ పాలనపై పౌరుల్లో నమ్మకాన్ని, సంతృప్తిని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జేసీ ఎ.రాజేంద్రన్ వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎ్‌ఫవో సుబ్బరాజు, ఆర్డీవో శ్రీనివాసులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కరుణ కుమారి, ఎంపీపీ హరి ప్రసాద్ చౌదరి, ఎమ్మార్వో శ్రీనివాసులు, మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.