Share News

రీసర్వే డీటీలు కావాలి

ABN , Publish Date - Apr 19 , 2026 | 02:02 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ సర్వేను రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌(ఆర్‌ఎస్‌ డీటీ)ల కొరత వెంటాడుతోంది. సర్వేలో కీలకంగా వ్యవహరించే ఆర్‌ఎస్‌ డీటీలు లేకపోవడంతో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలే ఇప్పుడూ చోటుచేసుకుంటున్నాయి.

రీసర్వే డీటీలు కావాలి

పదోన్నతి పొందినా వేరే పనులు

సీనియర్లకు చిక్కని సముచిత స్థానం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ సర్వేను రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌(ఆర్‌ఎస్‌ డీటీ)ల కొరత వెంటాడుతోంది. సర్వేలో కీలకంగా వ్యవహరించే ఆర్‌ఎస్‌ డీటీలు లేకపోవడంతో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలే ఇప్పుడూ చోటుచేసుకుంటున్నాయి.

మదనపల్లె, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 25 మండలాల్లో 11 మండలాలకు ఆర్‌ఎస్‌ డీటీలు లేరు. రీసర్వేలో క్షేత్రస్థాయిలో రికార్డులు, రైతుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను వారు దగ్గరుండి పరిష్కరించాల్సి ఉంది. 11 మండలాల్లో ఆ పోస్టులు ఖాళీగా ఉండటంతో రెగ్యులర్‌ డీటీలకే వారి బాధ్యతలు అప్పగించారు. ఫలితంగా పనిభారం ఎక్కువై వారు ఆ చాయలకు వెళ్లడం లేదు. వీఆర్వోలదీ ఇదే పరిస్థితి. కార్యాలయంలో సమావేశాలు, పీజీఆర్‌ఎస్‌, ఇతర రెగ్యులర్‌ విధులతో పూర్తి సమయం కేటాయించకపోవడంతో ఆ పనంతా గ్రామ సర్వేయర్లపైనే పడుతోంది. పైగా విధుల్లో భాగంగా రోజువారి లక్ష్యాలు విధించడం, దానికితోడు సాంకేతిక సమస్యలు, రీ-సర్వేకు రైతులు ఆసక్తి చూపకపోవడం తదితర కారణాలతో అవే తప్పులు పునరావృతమవుతున్నాయి.

రెగ్యులర్‌ డీటీలే ఇన్‌చార్జులుగా..

కురబలకోట, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, నిమ్మనపల్లె, రామసముద్రం, పెద్దమండ్యం, గుర్రంకొండ, సదుం, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో రీసర్వే డీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్‌ డీటీలు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలోని సీనియర్‌ అసిస్టెంట్‌, ఆర్‌ఐలకు పదోన్నతి కల్పిస్తూ రీసర్వే డీటీలుగా నియమించారు. గతంలో మండలానికి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ), అదనపు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌(ఎంఆర్‌ఐ)లలో ఒకరిని తీసేసి వారిని సర్వేకు నియమించారు. 2022 నుంచి 2025 వరకూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 116 మంది ఆర్‌ఎస్‌ డీటీలు ఉండగా వీరిలో 66 మంది పదోన్నతి పొందారు. అప్పుడున్న 66 మండలాలకు 66 మంది ఉన్నారనుకున్నా మిగిలిన వారంతా ఎక్కడున్నారన్నదే ప్రశ్న. వీరంతా క్షేత్రస్థాయిలో ఇతర పనులకు, సివిల్‌ సప్లయ్‌ విభాగానికి, డిప్యూటేషన్‌పై కలెక్టరేట్‌, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, కొత్తగా ఏర్పడిన కార్యాలయాలకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. దీంతో పదోన్నతిపై నియమించిన అసలు కార్యక్రమం కుంటుపడుతోంది.

సీసీఎల్‌ఏ ఆదేశాలు బేఖాతరు

సీసీఎల్‌ఏ నిబంధనల ప్రకారం రీసర్వే డీటీలుగా పదోన్నతి పొందిన సీనియర్‌ డీటీలు సీనియారిటీపై రెగ్యులర్‌ డీటీలుగా ఉండాలి. అది మచ్చుకైనా కనిపించడం లేదు. సీసీఎల్‌ఏ ఆదేశాలు బేఖాతర్‌ చేస్తూ సీనియర్లకు రెగ్యులర్‌ డీటీలుగా, జూనియర్లకు రీసర్వే డీటీలుగా ప్రమోషన్‌ ఇచ్చి రెగ్యులర్‌ డీటీలుగా కాకుండా ఆర్‌ఎస్‌ డీటీలుగానే చాలా మందిని వినియోగిస్తున్నారు. ఫలితంగా సీనియర్‌ డీటీలకు బాధ్యతల నిర్వహణలో అన్యాయం జరగడమే కాకుండా డీటీల సీనియారిటీ జాబితా పక్కదోవ పడుతోంది. 2022లో పదోన్నతి పొందిన 66 మందిలో డీటీలు శివకుమార్‌, మధుసూదన్‌ ఉన్నారు. ప్రస్తుతం శివకుమార్‌ పీలేరు ఇన్‌ఛార్జి తహసీల్దార్‌గా, మధుసూదన్‌ సోమల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.

Updated Date - Apr 19 , 2026 | 02:02 AM