Share News

ముంచుకొచ్చిన ముహూర్తం!

ABN , Publish Date - Oct 10 , 2026 | 01:48 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొచ్చింది. ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం.. ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో కీలక ముందడుగు పడింది. శనివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. ఒకట్రెండు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది.

ముంచుకొచ్చిన ముహూర్తం!

ఏ పదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి

చిత్తూరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొచ్చింది. ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం.. ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో కీలక ముందడుగు పడింది. శనివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. ఒకట్రెండు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అందరి దృష్టీ స్థానిక సంస్థల రిజర్వేషన్లపై మళ్లుతోంది. చిత్తూరు మేయర్‌ సహా ఏ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ పదవి ఏ వర్గానికి ఖరారవుతుందన్న దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆశావహుల హడావిడి మరింతగా పెరుగుతోంది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో అడ్డంకులు, సందిగ్ధత తొలగిన నేపథ్యంలో శనివారం రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రధానంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. గతంలో జరిగిన సమావేశంలోనే మంత్రివర్గం ఎస్సీ, ఎస్టీ స్థానాల శాతాలను ఖరారు చేసింది. బీసీ స్థానాల శాతాన్ని కూడా ఖరారు చేసినప్పటికీ సుప్రీంకోర్టు ఉత్తర్వులతో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి లోబడి ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ కారణంగా నేటి మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని గురించే ప్రఽధానంగా చర్చించి ఖరారు చేయనున్నారు. అన్ని రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా అధికారికంగా అమలు చేసినా.. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం పార్టీ పరంగా 34 శాతం సీట్లను కేటాయించనున్నట్లు మంత్రి పార్థసారథి శుక్రవారం ప్రకటించడం గమనార్హం. ఇక, స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం వెళ్లాక ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది. ఎలాంటి అడ్డంకులూ లేకుంటే సోమవారం షెడ్యూలు జారీ కావచ్చన్న అంచనాలున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం నెలకొంటోంది. ఏ స్థానిక సంస్థ ఏ వర్గానికి రిజర్వు అవుతుందన్న దానిపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంటోంది.

జడ్పీ, మున్సిపల్‌ రిజర్వేషన్లపై ఆసక్తి

గత స్థానిక సంస్థల ఎన్నికలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరిగాయి. 2022 ఏప్రిల్‌లో జిల్లాల విభజన జరగ్గా, గత నెలలో జిల్లా పరిషత్‌ల విభజన కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో కొత్త జడ్పీలకు తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో చిత్తూరు జడ్పీ చైర్మన్‌, చిత్తూరు మేయర్‌తోపాటు కుప్పం, పలమనేరు, నగరి మున్సిపల్‌ చైర్మన్‌ పదవులకు ఏ రిజర్వేషన్‌ ఖరారవుతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాలతోపాటు సామాన్య ప్రజల్లోనూ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా గతంలో జడ్పీలు 13 ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 28కు చేరింది. అలాగే మేయర్‌ స్థానాలు 13 నుంచి 17కు పెరిగాయి. ఈ నేపథ్యంలో గతంలో ఆయా స్థానాలకు ఖరారైన రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకోరని తెలుస్తోంది. గతంలో ఉమ్మడి చిత్తూరు జడ్పీ చైర్మన్‌ పదవి ఓసీకి కేటాయించారు. ఈ లెక్కన గత రిజర్వేషన్‌ మళ్లీ రిపీట్‌ కావచ్చు.. లేదా మారొచ్చని అధికారులు అంటున్నారు.

ఫ చిత్తూరు మేయర్‌ పదవిని గతంలో ఎస్సీలకు కేటాయించారు. ఈసారి ఆ స్థానం ఓసీలకు దక్కవచ్చని స్థానికంగా చర్చ జరుగుతోంది. నగరి మున్సిపల్‌ చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు, పలమనేరు బీసీ మహిళకు, కుప్పం ఓసీలకు కేటాయించారు. ఈసారి ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పదవులు ఏ వర్గానికి రిజర్వు అవుతాయనేది ఆసక్తిగా మారింది.

సిద్ధంగా జిల్లా యంత్రాంగం

తొలుత మున్సిపల్‌ ఎన్నికలు, ఆ తర్వాత పరిషత్తు, పంచాయతీ ఎన్నికల్ని నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రచురించారు. పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి, ఎన్నికల అధికారులనూ నియమించేశారు. చిత్తూరులోని జడ్పీ కార్యాలయం నుంచి శుక్రవారం పోలింగ్‌ సామగ్రిని మండలాలకు తరలించారు

చిత్తూరు మేయర్‌ జనసేనకు..?

చిత్తూరు కార్పొరేషన్‌ మేయర్‌ పీఠానికి టీడీపీ నుంచి విపరీతమైన పోటీ నెలకొంది. ఓసీకు వస్తే మద్దిపట్ల ఈశ్వర్‌నాయుడు, కాజూరి బాలాజీ, బీసీ అయితే సీకే లావణ్య, కఠారి హేమలత ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల సీట్ల సర్దుబాట్లపై సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు మేయర్‌ జనసేనకు కేటాయిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Updated Date - Oct 10 , 2026 | 01:48 AM