Share News

సాగు సమస్యలు, చీడపీడల నివారణపై పరిశోధనలు

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:10 AM

అధునాతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని రైతులకు అందించడం, అధిక దిగుబడినిచ్చే వంగడాలకు రూపకల్పన చేయడం, చీడపీడలు, వాతావరణ మార్పులు తట్టుకునే కొత్త వంగడాను రూపొందిస్తూ రైతులకు వ్యవసాయ వర్సిటీ సేవలందిస్తోందని వీసీ ఆర్‌.శారద జయలక్ష్మిదేవి పేర్కొన్నారు.

సాగు సమస్యలు, చీడపీడల  నివారణపై పరిశోధనలు
వ్యవసాయవర్సిటీ వీసీ శారద జయలక్ష్మిదేవి, పక్కన ఏడీఆర్‌ సుమతి, రెడ్డిశేఖర్‌

వ్యవసాయవర్సిటీ వీసీ వెల్లడి

తిరుపతి రూరల్‌, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): అధునాతన వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని రైతులకు అందించడం, అధిక దిగుబడినిచ్చే వంగడాలకు రూపకల్పన చేయడం, చీడపీడలు, వాతావరణ మార్పులు తట్టుకునే కొత్త వంగడాను రూపొందిస్తూ రైతులకు వ్యవసాయ వర్సిటీ సేవలందిస్తోందని వీసీ ఆర్‌.శారద జయలక్ష్మిదేవి పేర్కొన్నారు. బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నానోఎరువులు, బయోఫెర్టిలైజర్స్‌, చీడ, పీడలు, కొత్తరకాల వంగడాలు, పోషక భద్రతలపై పరిశోధనలు సాగించి రైతులకు చేరవేయడంలో వర్శిటీ విస్తరణ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.దేశంలో డ్రోన్లపై శిక్షణ నిర్వహించే మొదటి వర్సిటీగా ప్రత్యేక గుర్తింపు ఉందని వివరించారు. రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధరకు విక్రయించే విధంగా వర్సిటీలో మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా సమాచారం అందిస్తున్నామని, శాస్త్రపరంగా నిర్ధారించిన ఎరువుల వినియోగం, సీడ్‌రేట్‌పై అవగాహన కల్పిస్తున్నామని, వ్యవసాయంతోపాటు పశుపోషణ, మత్స్యసంపద, పుట్టగొడుగుల పెంపకంపై రైతులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రసాయన, సేంద్రియ ఎరువులే కాకుండా నానో ఎరువులు(యారియా, డీఏపీ) ఎంతమోతాదులో పంటలకు వేసుకోవాలనే అంశాలపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రైతులతో పలు కార్యక్రమాలు నిర్వహించి పంటలసాగులో ఎదుర్కొంటున్న సమస్యలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని తదనుగుణంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు రూపొందిస్తున్నారని వివరించారు.

నేడు ఆర్‌ఏఆర్‌ఎ్‌సలో కిసాన్‌మేళా

తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం, రాష్ట్ర వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కిసాన్‌మేళా నిర్వహిస్తున్నట్లు వీసీ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఏడీఆర్‌ డాక్టర్‌ సుమతి, వ్యవసాయ కళాశాల ఏడీ డాక్టర్‌ రెడ్డిశేఖర్‌, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 02:10 AM