అలిపిరి పాదాలమండపం పునరుద్ధరణ పనులు ప్రారంభం
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:23 AM
శిథిలావస్థలో ఉన్న అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి.
తిరుమల, జనవరి 6(ఆంధ్రజ్యోతి): శిథిలావస్థలో ఉన్న అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులు సేదతీరేందుకు దాదాపు 450 ఏళ్ల క్రితం విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ మండపం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది.తిరుమల పార్వేటమండపం తరహాలో దీన్ని పూర్తిగా తొలగించి నిర్మించాలని వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ అధికారులు ప్రయత్నించగా తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఆపేశారు.ప్రభుత్వ సహకారంతో ప్రస్తుత టీటీడీ బోర్డు, అధికారులు ఆర్కియాలజీ విభాగ సహకారంతో పాదాలమండపాన్ని సంరక్షించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే నవంబరు నెలలో పాదాలమండపాన్ని పరిశీలించిన ఆర్కియాలజీ విభాగం పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.శాస్ర్తీయ పద్ధతిలో అవే రాళ్లు, స్తంభాలు వినియోగించి పునర్నిర్మించాలని నిర్ణయించారు.శ్రీకాళహస్తిలో రూ.7 కోట్లతో లీకేజీ పనులు, సింహాచలం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో మరమ్మతు పనులు చేసిన పూణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలిజియస్ ట్రస్టు దాదాపు రూ.4 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణానికి ముందుకు రావడంతో ఆర్కియాలజీ విభాగ పర్యవేక్షణలో రెండురోజుల క్రితం పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం రాళ్లపై మార్కింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సీసీ కెమెరాల నిఘాలో రాళ్లు, స్తంభాలను జాగ్రత్తగా తొలగించి వెనుకభాగంలో భద్రపరచనున్నారు. పైకప్పులోనూ ఎలాంటి లీకేజీలు లేకుండా ఆరు నెలలోపు పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే 600 నుంచి 700 ఏళ్ల పాటు భావితరాలకు పాదాల మండపం అందుబాటులో ఉంటుందని ఆర్కియాలజీ విభాగం అధికారులు చెబుతున్నారు.