మామిడికి మళ్లీ మద్దతు
ABN , Publish Date - Jun 19 , 2026 | 01:16 AM
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తోతాపురి సుమారు 2 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. గతేడాది 6 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ సారి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎకరాకు సాగు ఖర్చు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు అవుతున్న నేపథ్యంలో రైతుకు కిలోకు కనీసం రూ.9 చొప్పున అమ్ముడైతేనే అసలు వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు రూ.12 నుంచి రూ.16 వరకు ధర డిమాండ్ చేస్తున్నారు.
కిలోకు రూ.4 సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం
మూడు జిల్లాల రైతులకు రూ.160 కోట్ల వరకు అందనున్న సాయం
గతేడాది రాయితీ రూ.187 కోట్లు జమ
ధరల్లేక దిగాలుపడిన తోతాపురి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. గతేడాదిలాగే ఈసారి కిలోకు రూ.4 రాయితీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనతో మామిడి రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
- చిత్తూరు, ఆంధ్రజ్యోతి
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తోతాపురి సుమారు 2 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. గతేడాది 6 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ సారి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎకరాకు సాగు ఖర్చు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు అవుతున్న నేపథ్యంలో రైతుకు కిలోకు కనీసం రూ.9 చొప్పున అమ్ముడైతేనే అసలు వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు రూ.12 నుంచి రూ.16 వరకు ధర డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీలు సగటున రూ.6 చొప్పున ఇస్తున్నాయి. మూడు జిల్లాల పరిధిలో 44 పల్ఫ్ ఫ్యాక్టరీలుండగా, నాలుగైదు మినహా మిగిలినవన్నీ పని చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని 31లో 28 ఫ్యాక్టరీలు ప్రాసెస్ మొదలుపెట్టాయి. వీటిలో 80 శాతం ఫ్యాక్టరీలు బయట బోర్డు పెట్టి మరీ కిలోకు రూ.6 చొప్పున ఇస్తున్నాయి. మరో 20శాతం ఫ్యాక్టరీలు మాత్రమే రూ.5 చొప్పున ఇస్తున్నాయి. సబ్సిడీతో కలిపి రైతుకు మొత్తంగా కిలో మీద రూ.10 చొప్పున అందనుంది. దీంతో రైతులకు ఎంతో ఉపశమనం లభించనుంది. బిల్లులు త్వరగా కావాలని ర్యాంపులకు వెళ్లే రైతులకు రూ.3 నుంచి రూ.4 వరకే అందుతోంది.
ఇప్పటికే లక్ష టన్నుల కోత..
ఈసారి సుమారు 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించడం కాస్త ఆలస్యమైంది. ఇప్పటికే సుమారు లక్ష టన్నుల కాయల్ని రైతులు అమ్మేసుకున్నారు. అమ్ముకున్నవారికీ సబ్సిడీ అందేలా ఆయా ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద అధికారులు రైతుల వివరాల్ని తీసుకోవాల్సి ఉంది. ఈసారి ఆగస్టు మొదటి వారం వరకు కోతలు ఉండే అవకాశముంది. మిగిలిన 4 లక్షల టన్నుల వివరాల్ని గతేడాది తరహాలోనే ఫ్యాక్టరీల, ర్యాంపుల వద్ద నుంచి సిబ్బంది వివరాలు తీసుకుంటారు.
గతేడాది 40 వేల మందికి రూ.187 కోట్లు..
గతేడాది దిగుబడి భారీగా రావడంతో ధరలు పతనమై రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతులు డిమాండ్ చేయకముందే జిల్లా రైతుల పరిస్థితిపై అవగాహన ఉన్న సీఎం చంద్రబాబు కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ ప్రకటించారు. ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద ప్రత్యేకంగా ఆయా శాఖల ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించి రైతుల జాబితాలను తయారు చేశారు. ఆ తర్వాత రైతు సేవా కేంద్రాల్లోనూ ఆ జాబితాలను సరిచూశారు. అత్యంత పారదర్శకంగా జాబితాను తయారుచేసి అక్టోబరులోనే రైతుల ఖాతాల్లో సబ్సిడీ జమ చేశారు. చిత్తూరు జిల్లా వరకు 32 వేల మంది రైతులకు రూ.147 కోట్ల సబ్సిడీని అందించగా, మూడు జిల్లాలకు కలిపి 40 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.187 కోట్లను జమ చేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి సుమారు లక్ష టన్నుల దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలో సుమారు రూ.160 కోట్ల వరకు రైతులకు సబ్సిడీ జమయ్యే అవకాశాలున్నాయి.