Share News

1.36 లక్షల ఓట్ల తొలగింపు

ABN , Publish Date - Aug 01 , 2026 | 02:14 AM

జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే పలమనేరు నియోజకవర్గంలోనే అత్యధికంగా 29,381 మంది ఓటర్ల పేర్లు తొలగించారు. ఆ తర్వాత చిత్తూరులో 26436 మంది, కుప్పంలో 24418 మంది, నగరిలో 20879 మంది, పూతలపట్టులో 20321 మందిను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. జీడీనెల్లూరులో నియోజకవర్గంలో మాత్రం అత్యల్పంగా 14624 మంది పేర్లే తొలగించారు.

1.36 లక్షల ఓట్ల తొలగింపు

పలమనేరులో అత్యధికం.. జీడీనెల్లూరులో అత్యల్పం

ముసాయిదా జాబితా విడుదల

13.40 లక్షల నుంచి 12.04 లక్షలకు తగ్గిన ఓటర్ల సంఖ్య

చిత్తూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ఏడాది జూన్‌ 1న ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలో ఉన్న 13,40,126 మంది ఓటర్లలో 1,36,059 మంది పేర్లను తొలగించారు. ప్రస్తుత ముసాయిదా జాబితాలో 12,04,067 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. దీంతో జిల్లాలో దాదాపు పది శాతం ఓటర్లు జాబితా నుంచి తొలగింపునకు గురైనట్లు స్పష్టమైంది.

జూన్‌ 1న విడుదలైన జాబితాలో జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 6,58,823 మంది, మహిళలు 6,81,236 మంది, థర్డ్‌ జెండర్‌కు చెందిన 67 మంది ఉన్నారు. అనంతరం చేపట్టిన ప్రత్యేక సమగ్ర పరిశీలనలో మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేరున్నవారు, గుర్తించలేని ఓటర్ల పేర్లను తొలగిస్తూ అధికారులు ముసాయిదా జాబితాను సిద్ధం చేశారు.

పలమనేరులోనే అత్యధిక తొలగింపులు

జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే పలమనేరు నియోజకవర్గంలోనే అత్యధికంగా 29,381 మంది ఓటర్ల పేర్లు తొలగించారు. ఆ తర్వాత చిత్తూరులో 26436 మంది, కుప్పంలో 24418 మంది, నగరిలో 20879 మంది, పూతలపట్టులో 20321 మందిను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. జీడీనెల్లూరులో నియోజకవర్గంలో మాత్రం అత్యల్పంగా 14624 మంది పేర్లే తొలగించారు.

ముసాయిదా జాబితాలో నియోజకవర్గాల వారీగా ఓటర్లు

పలమనేరు 2,42,945

కుప్పం 2,06,056

పూతలపట్టు 202434

జీడీనెల్లూరు 192718

నగరి 182814

చిత్తూరు 177100

జాబితాపై రాజకీయ పార్టీల దృష్టి

జిల్లాలో 1.36 లక్షల ఓట్లు తొలగింపునకు గురి కావడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. కూటమిలోని మూడు పార్టీలతో పాటు వైసీపీ కూడా తొలగించిన ఓటర్ల వివరాలను బూత్‌ స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. అర్హుల పేర్లు తొలగించి ఉంటే వాటిని తిరిగి చేర్చేందుకు ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అభ్యంతరాల అనంతరం తుది జాబితా

ముసాయిదా జాబితాపై అర్హులైన ఓటర్లు, రాజకీయ పార్టీలు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు అందించవచ్చు. నిజమైన ఓటర్లు ఫారం-6తో మళ్లీ నమోదు చేసుకునే అవకాశముంది. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి, అక్టోబరు 3న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. నోటీసు, విచారణ లేకుండా ఏ ఓటరు పేరునూ తొలగించమని అధికారులు స్పష్టత ఇస్తున్నారు.

Updated Date - Aug 01 , 2026 | 02:14 AM