గ్రామ పంచాయతీలకు ఊరట
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:09 AM
గ్రామ పంచాయతీల్లోని ఆర్థిక సంఘం నిధుల చెల్లింపులపై కూటమి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియనుంది.
ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో సడలింపు
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లోని ఆర్థిక సంఘం నిధుల చెల్లింపులపై కూటమి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంఘం నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చుచేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. వీటి వినియోగంలో పారదర్శకత పాటించేలా చర్యలకు ఉపక్రమించింది. ఇష్టానుసారంగా బిల్లులు పెట్టొందంటూ నిధుల వినియోగంపై ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ ప్రకారం.. ఆర్థిక సంఘం నిధుల్లో 30శాతం పారిశుధ్యం, మరో 30శాతం తాగునీటి సరఫరా, మిగతా 40 శాతం ఇతరత్రా పనులకు వెచ్చించాలి. కాగా, తాజాగా 2025-26 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు రూ.28,52,04,883 విడుదలయ్యాయి. వాటిలో బేసిక్ గ్రాంట్‌గా రూ.11,40,81,966, టైడ్ కింద రూ.17,41,22,917ను పంచాయతీ ఖాతాల్లో జమచేశారు. ఇప్పటివరకు ఉన్న నిఽబంధనలకు సడలింపు ఇవ్వడంతో సర్పంచులకు ఊరట లభించింది.