‘పరిషత్’ అభ్యర్థులకు ఉపశమనం!
ABN , Publish Date - Oct 29 , 2026 | 01:14 AM
‘పరిషత్’ ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ తేదీలను రీషెడ్యూల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. తొలుత నవంబరు 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని ప్రకటించగా.. తాజాగా 5న పోలింగ్, 7న లెక్కింపు ఉంటుందని ఉత్తర్వులు విడుదల చేసింది.
ఎన్నికల తేదీల రీ షెడ్యూల్
5న పోలింగ్, 7న కౌంటింగ్
ప్రచారాలకు, మంతనాలకు అవకాశం
జడ్పీటీసీలకు బరిలో 89మంది.. ఎంపీటీసీలకు 702 మంది
చిత్తూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘పరిషత్’ ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ తేదీలను రీషెడ్యూల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. తొలుత నవంబరు 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని ప్రకటించగా.. తాజాగా 5న పోలింగ్, 7న లెక్కింపు ఉంటుందని ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అక్టోబరు 28న, ఓట్ల లెక్కింపు అక్టోబరు 30న ఉండేది. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేసే అవకాశమివ్వలేదని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు సూచన మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్లు వేసే అవకాశాన్ని మళ్లీ కల్పించింది. చిత్తూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితి లేకపోవడంతో ఆ ఉత్తర్వులు ఇక్కడ వర్తించలేదు. దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం మున్సిపల్ పోలింగ్, కౌంటింగ్ తేదీలను మార్చింది. నవంబరు 3వ తేదీన పరిషత్ పోలింగ్ అని గతంలో ప్రకటించగా.. తాజాగా అదే రోజున మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వచ్చింది. దీంతో పరిషత్ పోలింగ్, కౌంటింగ్ తేదీలను రీ షెడ్యూల్ చేశారు.
- జిల్లాలో 27 జడ్పీటీసీ స్థానాలుండగా.. పూతలపట్టు, బంగారుపాళ్యం, యాదమరి ఏకగ్రీవమవ్వగా, 24 స్థానాల్లో పోటీ ఉంది. 89 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 370 ఎంపీటీసీ స్థానాల్లో 70 ఏకగ్రీమవ్వగా, 300 స్థానాల్లో ఎన్నిక ఉంటుంది. 702 మంది పోటీ పడుతున్నారు.
- పరిషత్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో ముగిసింది. ఎక్కడెక్కడ ఎంత మంది బరిలో ఉన్నారనేది స్పష్టమైంది. దీంతో బుధవారం నుంచి ఆయా మండలాల్లో జడ్పీటీసీ అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఒక్కో అభ్యర్థికి రోజుకు సగటున మండలాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వస్తోంది. 5న పోలింగ్ ఉండడంతో 3వ తేదీ వరకు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. రెండు రోజులకు ఎన్నికలు వాయిదా పడడంతో అభ్యర్థులు ఓ రకంగా ఆర్థిక భారం పడుతుంది. మరో రకంగా చూసుకుంటే.. ప్రచారం మరింత ముమ్మరంగా చేసుకునేందుకు, గ్రామ స్థాయి నాయకులతో మంతనాలు చేసేందుకు అవకాశం లభిస్తుంది.