కిరణ్ రాయల్‌కు ఊరట
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:31 AM
మాజీ మంత్రి ఆర్‌కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ప్రభుత్వంలో నమోదైన క్రిమినల్ కేసుల నుంచీ తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్‌కు ఊరట లభించింది. నాలుగేళ్ళ కిందట ఆయనపై నమోదైన మూడు క్రిమినల్ కేసులనూ సోమవారం నగరి కోర్టు కొట్టివేసింది. గత ప్రభుత్వంలో మంత్రిగా వున్న నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా
రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసుల కొట్టివేత
తిరుపతి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి ఆర్‌కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ప్రభుత్వంలో నమోదైన క్రిమినల్ కేసుల నుంచీ తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్‌కు ఊరట లభించింది. నాలుగేళ్ళ కిందట ఆయనపై నమోదైన మూడు క్రిమినల్ కేసులనూ సోమవారం నగరి కోర్టు కొట్టివేసింది. గత ప్రభుత్వంలో మంత్రిగా వున్న నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తరచూ టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆమె విమర్శలు, ఆరోపణలు చేసిన ప్రతిసారీ తిరుపతిలో ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ ఆమెపై ఘాటుగా ప్రతి విమర్శలు, ఆరోపణలు చేసేవారు. ఆ క్రమంలో 2022 అక్టోబరులో కిరణ్ రాయల్ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాంతో రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీకి చెందిన నగరి మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ సాయి సంధ్యారాణి కిరణ్ రాయల్‌పై నగరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మరో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో 2022 అక్టోబరు 18వ తేదీన కిరణ్ రాయల్‌పై నగరి పోలీసులు రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి అదే ఏడాది నవంబరు 11న రాత్రి నగరి, తిరుచానూరు పోలీసులు కిరణ్ రాయల్‌ను అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని నగరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతడి నుంచీ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకునే సందర్భంగా పోలీసులపై దౌర్జన్యం చేశారంటూ అదే రోజు మరో కేసు కూడా నగరి పోలీసు స్టేషన్‌లో నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లో అతడిని నిందితుడుగా చూపిస్తూ నవంబరు 12న నగరి కోర్టులో హాజరుపరిచారు. మంత్రి రోజా ఒత్తిడితో పోలీసులు కిరణ్ రాయల్‌ను అరెస్టు చేశారంటూ పెద్దఎత్తున సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. కిరణ్ రాయల్‌ను నగరి పట్టణం తిరుత్తణి రోడ్డులో అరెస్టు చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొనగా, కిరణ్ రాయల్ తరపు న్యాయవాదులు అతడిని తిరుపతిలో ఇంటి వద్ద అదుపులో తీసుకున్నట్టు సీసీ కెమెరాల ఫుటేజీలు సమర్పించడంతో కోర్టు రిమాండుకు నిరాకరించి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు తన ఐఫోన్ స్వాధీనం చేసుకుని, తన అనుమతి లేకుండా దాన్ని ఓపెన్‌చేసి తన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ కిరణ్ రాయల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నగరి జూనియర్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ మూడు కేసుల విచారణ కొనసాగింది. కిరణ్ రాయల్‌పై నమోదైన మూడు కేసులూ పెట్టీ కేసులని, నేర నిరూపణ కాలేదని కొట్టివేస్తూ సోమవారం ఇన్‌ఛార్జి మెజిస్ట్రేట్ బాబు తీర్పు ఇచ్చారు.