Share News

వేసవిలో భక్తులకు ఉపశమనం

ABN , Publish Date - Apr 12 , 2026 | 01:16 AM

కాణిపాకంలో భక్తులకు వేసవి నుంచి ఉపశమనం కలిగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో ఆలయ చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌లు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.

 వేసవిలో భక్తులకు ఉపశమనం
ఆలయ మాడవీధిలో మ్యాట్‌పై వెళుతున్న భక్తులు

కాణిపాకంలో గ్రీన్‌ షేడ్‌ చలువ పందిళ్ల ఏర్పాటు

ఎండ తీవ్రత సమయంలో మజ్జిగ పంపిణీ

ఐరాల(కాణిపాకం), ఏప్రిల్‌ 11 (ఆంద్రజ్యోతి): కాణిపాకంలో భక్తులకు వేసవి నుంచి ఉపశమనం కలిగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో ఆలయ చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌లు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. గతంలో వేసవి కాలంలో ఆలయం పరిసరాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేయాలంటే కష్టంగా ఉండేది. ఆలయ ఈఈ వెంకటనారాయణ వినూత్న ఆలోచన ఫలితంగా ఆలయం వద్ద గ్రీన్‌ షేడ్‌ చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మాడ వీధుల్లో ఎండతీవ్రతకు భక్తులు అవస్థలు పడకుండా రిఫ్లెక్టివ్‌ వైట్‌ కలర్‌ను వేశారు. ఈ మార్గంలో నడిస్తే పాదాలకు హాని జరగదని అధికారులు తెలిపారు. దర్శన క్యూలైన్లలో ఫ్యాన్లు, పెద్ద కూలర్లను ఏర్పాటు చేశారు. ఆలయం లోపల కూడా గ్రీన్‌ షేడ్‌ను ఏర్పాటు చేశారు. ఎండ ప్రభావం ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు మజ్జిగను అందిస్తున్నారు. రోజూ 150 లీటర్ల పెరుగును మజ్జిగగా తయారుచేసి అందిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. వేసవిలో స్వామి దర్శనానికి వచ్చే భక్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నామని పేర్నొన్నాయి.

Updated Date - Apr 12 , 2026 | 01:16 AM