పంచాయతీ నిధుల గోల్‌మాల్‌పై మళ్లీ విచారణ
ABN , Publish Date - Jan 29 , 2026 | 01:02 AM
రైల్వేకోడూరు పంచాయతీలో నిధుల గోల్‌మాల్‌పై రెండోసారి విచారణకు ఆదేశాలు వెలువడ్డాయి.
రైల్వేకోడూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రైల్వేకోడూరు పంచాయతీలో నిధుల గోల్‌మాల్‌పై రెండోసారి విచారణకు ఆదేశాలు వెలువడ్డాయి. జనరల్ ఫండ్, 15వ ఆర్ధిక సంఘం నిధుల వినియోగంలో భారీగా అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో అప్పట్లో అన్నమయ్య జిల్లా అధికారులు విచారణ జరిపారు.అవినీతి ఆరోపణలపై అధికారులను, సిబ్బందిని ప్రశ్నించారు.నివేదికను విజయవాడ పంచాయతీ కమిషనర్‌కు పంపారు. అయితే జిల్లా పునర్విభజనతో జనవరి 1 నుంచి రైల్వేకోడూరు తిరుపతి జిల్లాలోకి చేరింది.దీంతో ఈ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు పూనుకున్నారు. విచారణ అధికారిగా డీఎల్పీవో సురేష్ నాయుడిని కలెక్టర్ నియమించారు.
ఇవీ ఆరోపణలు
జనరల్ ఫండ్ నిధుల్లో భారీగా నొక్కేశారని, 15వ ఆర్ధిక సంఘం నిధులు భోంచేశారని ఆరోపణలు వచ్చాయి. ప్లాన్ అఫ్రూవల్స్‌లో అవినీతి చోటు చేసుకుందని మరో ఆరోపణ. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సిబ్బంది ఒక నాయకుడికి ఖరీదైన కారు కూడా కొనిచ్చారనే ప్రచారం జరుగుతోంది. వీటిలో నిజమేదో, అబద్ధపు ప్రచారమేదో తిరుపతి జిల్లా అధికారుల విచారణలో నిగ్గు తేలాల్సివుంది.ఈ అంశంపై డీఎల్పీవో సురేష్‌నాయుడిని ఆంధ్రజ్యోతి ప్రతినిధి సంప్రదించగా, గతంలో జరిగిన విచారణ నివేదికను అడిగామని, దానిని పరిశీలించిన తర్వాత తాము విచారణ మొదలెడతామని చెప్పారు.