Share News

పట్టాదారులకు తిప్పలు

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:58 PM

పుంగనూరు మండలంలో రీసర్వే పూర్తయిన మంగళం గ్రామానికి 1052 పాసుపుస్తకాలు వచ్చాయి.

పట్టాదారులకు తిప్పలు

చిత్తూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి):

పుంగనూరు మండలంలో రీసర్వే పూర్తయిన మంగళం గ్రామానికి 1052 పాసుపుస్తకాలు వచ్చాయి. అందులో కేవలం 245 మాత్రమే తప్పుల్లేకుండా ఉన్నాయి. మిగిలిన 807 పుస్తకాల్లో ఫొటోలు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం, ఖాతా నెంబర్లు.. ఇలా అన్నింటిలో తప్పులు దొర్లాయి.

నిండ్ర మండలంలోని ఆరు గ్రామాల్లో రీసర్వే జరిగింది. 3884 పుస్తకాలు మండలానికి చేరాయి. వాటిలో 2584 పుస్తకాలు మాత్రమే సక్రమంగా ఉన్నాయి. 413 పుస్తకాల్లో ఫొటోలు మారిపోయాయి. 27 పుస్తకాల్లో అసలు ఫొటోలే లేవు. 897 పుస్తకాల్లో ఇతర తప్పులున్నాయి.

అప్పట్లో జగన్‌ ఫొటో పిచ్చితో

వైసీపీ హయాంలో సీఎం జగన్‌ ఫొటో పిచ్చి పరాకాష్ఠకు చేరింది. జనన, మరణ ధ్రువపత్రాలనూ వదల్లేదు. చివరకు రీసర్వే చేశాక పొలాల సరిహద్దులు చూపుతూ నాటే రాళ్లకూ ఆయన బొమ్మలేశారు. రైతులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాల మీద జగన్‌ ఫొటోలే. తమ భూములకు జగన్‌ ఫొటో ఏంటని రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో ఎన్నికల సందర్భంగా తాను గెలిస్తే జగన్‌ ఫొటోలున్న పుస్తకాలను రద్దు చేసి, రాజముద్రతో ఉన్న పుస్తకాలను ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనుకున్నట్టే శుక్రవారం నుంచి రాజముద్రతో ఉన్న పుస్తకాల పంపిణీని ప్రారంభించారు. కానీ, వాటిలో పెద్దఎత్తున తప్పులు దొర్లాయి. దీనికి తోడు సర్వర్‌ పనిచేయకపోవడంతో పంపిణీ లక్ష్యాన్ని చేరుకోలేదు.

ఏడాదికి పైగా నిరీక్షణ.. ఆపై తప్పులు

జిల్లాలోని 329 గ్రామాల్లో రీసర్వే చేసిన వైసీపీ ప్రభుత్వం.. 90,287మంది రైతులకు పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేసింది. ఆయా పుస్తకాల కవర్‌ పేజీ మీద, లోపల ప్రతి పేజీలోనూ జగన్‌ ఫొటోలు ముద్రించి ఇవ్వడంతో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, జగన్‌ ఫొటోతో ఉన్న పుస్తకాలను రద్దు చేయడంతో రెవెన్యూ అధికారులు ఆ పుస్తకాలను రైతుల నుంచి వెనక్కి తీసుకున్నారు. సుమారు ఏడాది దాటాక, శుక్రవారం నుంచి కొత్త పుస్తకాలను పంపిణీ చేయడం ప్రారంభించారు.

50 శాతం పుస్తకాల్లో తప్పులే..

జిల్లాకు 78 వేల పాసుపుస్తకాలు వచ్చాయి. వీటిలో చిత్తూరు డివిజన్‌కు 28 వేలు, కుప్పానికి 14 వేలు, పలమనేరుకు 26 వేలు, నగరికి 10 వేల పుస్తకాలను చేర్చారు. అక్కడి నుంచి మండలాలకు, గ్రామాలకు పంపిణీ చేశారు. ఈ 78వేల పుస్తకాల్లో 18 వేల పుస్తకాల్లో తప్పులున్నాయని గుర్తించి, మండలాలకు పంపకుండా జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లోనే ఆపేశారు. మిగిలిన 58 వేల పుస్తకాల్లో కూడా సుమారు 20 వేల పుస్తకాల్లో తప్పులున్నట్లు మండలాల్లో మళ్లీ గుర్తించారు. అంటే మొత్తంగా 78 వేలల్లో 38 వేల పుస్తకాల్లో తప్పులున్నాయి.ఫొటోలు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం, ఖాతా నెంబర్లు.. ఇలా చాలా తప్పుల్ని క్షేత్రస్థాయి అధికారులు గుర్తించారు. అలాంటి పుస్తకాల్ని పంపిణీ చేయకుండా వెనక్కి పంపేస్తున్నారు.

సర్వర్‌ డౌన్‌తో నెమ్మదిగా పంపిణీ

ఈ పుస్తకాలను రైతులకు అందించే క్రమంలో వారి వద్ద నుంచి బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తీసుకోవాల్సి ఉంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పంపిణీ ప్రారంభించడంతో సర్వర్‌ డౌన్‌ అయిపోయింది. దీంతో తొలిరోజు పంపిణీ సక్రమంగా జరగలేదు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు పంపిణీ చేయాల్సి ఉంది. తొలి రోజు పుంగనూరు మండలంలోని మంగళం గ్రామంలో 1052కు గానూ 32 పుస్తకాలను మాత్రమే పంపిణీ చేశారు.ఈ విషయమై డీఆర్వో మోహన్‌కుమార్‌ను సంప్రదించగా చాలావరకు పుస్తకాల్లో తప్పులు దొర్లిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. శనివారం నుంచి సర్వర్‌ వేగంగా పనిచేసేలా చూసి గడువులోగా పంపిణీ పూర్తి చేస్తామన్నారు.పుస్తకాల్లోని తప్పుల్ని సవరించి మళ్లీ కొత్తవాటిని అందించే బాధ్యత ప్రభుత్వానిదే అని, ప్రస్తుతానికి తప్పుల్లేని పుస్తకాలను మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశించామన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 12:01 AM