నకిలీ పత్రాలతో నిషేధిత భూముల్ని రిజిస్ర్టేషన్ చేస్తే డాక్యుమెంట్ రద్దు
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:02 AM
నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ర్టేషన్లపై ప్రభుత్వం కొరడా ఝలిపించింది. వాటిని రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్ సారథ్యంలోని కమిటీకి అప్పగించింది. రిజిస్ర్టార్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు సబ్ రిజిస్ర్టేషన్ల చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం గత వారం ఉత్తర్వులు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ అధికారి ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటారు. ఐజీ అనుమతితో క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తారు.
రిజిస్ర్టేషన్ల చట్టానికి సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ
ఉద్దేశపూర్వకంగా చేసుంటే సబ్ రిజిస్ర్టార్‌పైనా చర్యలు
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 1(ఆంధ్రజ్యోతి): నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ర్టేషన్లపై ప్రభుత్వం కొరడా ఝలిపించింది. వాటిని రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్ సారథ్యంలోని కమిటీకి అప్పగించింది. రిజిస్ర్టార్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు సబ్ రిజిస్ర్టేషన్ల చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం గత వారం ఉత్తర్వులు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ అధికారి ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటారు. ఐజీ అనుమతితో క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తారు.
22ఎ, 22బి, 22సి జాబితాలోని నిషేధిత భూముల్ని నకిలీ పత్రాలతో రిజిస్ర్టేషన్ చేసినట్లు ఎవరైనా సంబంధిత రిజిస్ర్టార్‌కు ఫిర్యాదు చేస్తే సుమోటాగా డాక్యుమెంట్‌ను రద్దు చేసి చర్యలు ప్రారంభించవచ్చు. ఫిర్యాదుదారుడు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఫిర్యాదు అందిన 15 రోజుల్లో రిజిస్ర్టార్ ప్రాథమిక విచారణ చేయాలి. ఆధారాలు ఉన్నాయని తేలితే రద్దు చర్యలు ప్రారంభించాలి. ఆధారాలు లేదంటే ఫిర్యాదును తిరస్కరించాలి. అందుకు కారణాలను ఫారం-3లోని రిజిస్టర్‌లో నమోదు చేయాలి. తప్పుడు పత్రాలతో రిజిస్ర్టేషన్ చేసినట్లు తేలితే విచారణ ప్రారంభించి డాక్యుమెంట్‌లో పేర్కొన్న పార్టీలకు నోటీసులు ఇవ్వాలి. దస్తావేజు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ అయిందని తేలితే రాతపూర్వకంగా నమోదు చేసి రద్దు ప్రక్రియను కొనసాగించాలి. దీన్ని జిల్లా స్థాయి కమిటీకి పంపాలి. రిజిస్ర్టార్ నుంచి వచ్చిన నివేదికపై 15రోజుల్లోపు కలెక్టర్ సారథ్యంలోని కమిటీ సమావేశమై రిజిస్ర్టార్ ప్రతిపాదనలతో పాటు వచ్చిన సమాధానాలు, సాక్ష్యాలను సమీక్షిస్తుంది. తమ నిర్ణయాన్ని రిజిస్ర్టార్‌కు పంపిస్తుంది. జిల్లా కమిటీ నిర్ణయం అందిన ఏడు రోజుల్లో రిజిస్ర్టార్ తుది ఉత్తర్వులు జారీ చేయాలి. డాక్యుమెంట్ రద్దు లేదా తిరస్కరణకు సంబంధించిన నిర్ణయాన్ని అందరికి పంపాలి. నిబంధనలకు విరద్ధంగా రిజిస్ర్టేషన్ జరిగినట్లు గుర్తిస్తే రిజిస్ర్టేషన్‌శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ నేరుగా చర్యలు తీసుకోవచ్చు. సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరవచ్చు. ఆ తర్వాత రిజిస్ర్టేషన్ రద్దు లేదా ఫిర్యాదును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. ఏదైనా పత్రం నకిలీదని తేలితే దాని ఆధారంగా రిజిస్ర్టేషన్ చేయకూడదు. బుక్ నెంబరు-2లో విధిగా నమోదు చేయాలి. కోర్టు, ట్రిబ్యునల్, తాత్కాలిక లేదా శాశ్వత అటాచ్‌మెంట్ చేస్తే వాటిని రిజిస్ర్టేషన్ చేయకూడదు.