Share News

మహిళ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి రూ. కోట్ల స్థలం రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - Jul 30 , 2026 | 01:02 AM

ఓ మహిళ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువజేసే భూమిని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసిన కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను తిరుచానూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మహిళ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి రూ. కోట్ల స్థలం రిజిస్ట్రేషన్‌

-ఫోర్జరీ కేసులో ఐదుగురు అరెస్ట్‌

తిరుపతి(నేరవిభాగం), జూలై 29(ఆంధ్రజ్యోతి): ఓ మహిళ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువజేసే భూమిని వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసిన కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను తిరుచానూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ సునీల్‌ కుమార్‌ కథనం ప్రకారం...తిరుపతికి చెందిన చిచ్చలి అరుణమ్మ (76) కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తిరుపతి అర్బన్‌ మండలం చెన్నాయగుంట గ్రామ పరిధిలోని శేషాచలం హిల్‌ వ్యూ లేఅవుట్‌, హెచ్‌ఐజీ ఫేజ్‌-1, ఫ్లాట్‌ నం: 18 లోని 563.8 చదరపు గజాల స్థలాన్ని 2006లో కొనుగోలు చేశారు.ఆ స్థలాన్ని దాన సెటిల్‌మెంట్‌ ద్వారా తన తల్లి అరుణమ్మ పేరిట 2013లో బదిలీ చేశారు. కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఆ స్థలం అమ్మకానికి ఉందా అని విచారించడంతో అనుమానం వచ్చిన అరుణమ్మ ఈసీ తీసి పరిశీలించగా, సదరు స్థలం పి. జై భరత్‌ రెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్‌ అయినట్లు గుర్తించారు. రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్‌ పత్రాల ప్రతులు తెప్పించి పరిశీలించగా, అందులో ఉపయోగించిన ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఫొటో, సంతకాలు, వయస్సు, ఇతర గుర్తింపు వివరాలు పూర్తిగా నకిలీవని గ్రహించారు. తన ప్రమేయం లేకుండానే తన సంతకాలు ఫోర్జరీ చేసి తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని గ్రహించిన ఆమె తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి సబ్‌రిజిస్ట్రార్‌ హబీబుల్లా, నకిలీ పట్టాదారు పి. జై భరత్‌ రెడ్డి, సాక్షులుగా ఉన్న రాయవరపు బాబ్జీ, ముక్కర చైతన్య కుమార్‌, డాక్యుమెంట్‌ రైటర్‌ సంతోష్‌ తదితరులు కుమ్మక్కై రేణిగుంట సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తప్పుడు పత్రాలు, నకిలీ గుర్తింపు వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పి. జై భరత్‌ రెడ్డి, కొప్పోలు సాయిరాం అలియాస్‌ సాయి అలియాస్‌ సంతోష్‌, ముక్కర చైతన్య కుమార్‌, ఎం.జె. బాబు, షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌ తదితరులను నిందితులుగా గుర్తించారు. వీరిలో ఐదుగురిని అరెస్ట్‌ చేసి కేసుకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది.పరారీలో ఉన్న రాయవరపు బాబ్జీ అలియాస్‌ ఆకాష్‌, ఎ. కుమారి కోసం గాలింపు కొనసాగుతోందని, త్వరలో వారిని కూడా అరెస్ట్‌ చేస్తామని సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. అలాగే ఫోర్జరీకి సంబంధించిన మరిన్ని పత్రాలు, ఇతర ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌ హబీబుల్లాను కూడా త్వరలో అరెస్ట్‌ చేస్తామని సీఐ వెల్లడించారు.

Updated Date - Jul 30 , 2026 | 01:02 AM