Share News

శ్రీసిటీలోని 26న ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు

ABN , Publish Date - Oct 15 , 2026 | 01:22 AM

శ్రీసిటీలోని క్రియా యూనివర్సిటీలో ఈనెల 26న నిర్వహించనున్న ప్రాంతీయ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు.

శ్రీసిటీలోని 26న ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు
క్రియా యూనివర్సిటీలో పర్యటిస్తున్న కలెక్టర్‌, పరిశ్రమల సీఈవో, శ్రీసిటీ ఎండీ

సత్యవేడు, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): శ్రీసిటీలోని క్రియా యూనివర్సిటీలో ఈనెల 26న నిర్వహించనున్న ప్రాంతీయ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు సీఈవో షన్మోహన్‌, శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవి సన్నారెడ్డితో కలిసి క్రియా యూనివర్సిటీలో ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రాంతీయ పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఇతర ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సదస్సు జరిగే ప్రాంగణంలో వేదిక, సమావేశ మందిరాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌ సరఫరా, పార్కింగ్‌ వంటి ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, వాహన పార్కింగ్‌, రూట్‌ మ్యాపింగ్‌ వంటి అంశాలపై పోలీసు, రవాణాశాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. సదస్సు ప్రాంగణంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ముందస్తు చర్యలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు సీఈవో షన్మోహన్‌ మాట్లాడుతూ... సదస్సును విజయవంతం చేయడానికి పరిశ్రమల శాఖ, పోలీసు, రెవెన్యూ, శ్రీసిటీ, ఏపీఐఐసీ తదితర శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు ద్వారా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు అనుకూల వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సూళ్లూరుపేట ఆర్డీవో దేవేంద్రరెడ్డి, శ్రీసిటీ జనరల్‌ మేనేజర్‌ భగవాన్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ విజయభరత్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు అధికారులు, డీఆర్‌డీఏ అధికారి, శ్రీసిటీ డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 01:22 AM