సచివాలయ వ్యవస్థలో సంస్కరణలు
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:55 PM
తాజాగా సచివాలయ వ్యవస్థనూ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది.
చిత్తూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఇటీవల పెద్దఎత్తున సంస్కరణల్ని తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం, తాజాగా సచివాలయ వ్యవస్థనూ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది.వైసీపీ ప్రభుత్వం ఒక్కో సచివాలయంలో 10నుంచి 16 మంది వరకు సిబ్బందిని నియమించగా, కూటమి ప్రభుత్వం రీగ్రూపింగ్ పేరుతో ఇప్పటికే ఈ సంఖ్యను తగ్గించింది. ఉద్యోగుల సమయపాలన, హాజరు విషయాలపై విమర్శలు వస్తుండగా, ఇప్పుడు వాటిని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. హాజరు విషయంలో ఇప్పటివరకు ఇష్టానుసారంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు, ఇక నుంచి బాధ్యతగా వ్యవహరించక తప్పదు. అలాగే, సెలవు కోసం డీడీవోల వద్ద నిలబడే పని లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కూడా కల్పించింది.
కలెక్లర్ల సదస్సులో హాజరు విషయంపై చర్చ
పుంగనూరుతో కలిపి చిత్తూరు జిల్లాలో 612 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా, 4088 మంది పనిచేస్తున్నారు. వీరిలో 3280 మందికి బయోమెట్రిక్ ద్వారా హాజరువేసే సౌలభ్యం ఉంది. కానీ, డిసెంటరు 1 నుంచి 15వ తేదీ మధ్యలో 1250 మంది మాత్రమే హాజరు వేశారు. ఈ విషయం డిసెంబరు 17వ తేదీ వెలగపూడిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో చర్చకు వచ్చింది.
రీగ్రూపింగ్‌తో మిగిలిపోయిన ఉద్యోగులు
కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో భాగంగా 612 సచివాలయాలను 310 క్లస్లర్లుగా మార్చింది. జనాభాను బట్టి సచివాలయాల స్థాయిని విభజించింది. 2500 మంది కంటే తక్కువ జనాభా ఉంటే ఆరుగురు, 2501-3500 మంది ఉంటే ఏడుగురు, 3501 మంది కంటే ఎక్కువగా ఉంటే 8 మంది సిబ్బంది పనిచేసేలా ఆదేశాలిచ్చింది. మన జిల్లాలో కూడా ఈ రీగ్రూపింగ్ పూర్తయింది. దీంతో 917 మంది సచివాలయ ఉద్యోగులు మిగులుగా ఉన్నారు.
పర్యవేక్షణ వ్యవస్థ పటిష్టం
నిర్దిష్ట పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. కొంతమంది ఉదయం ఆలస్యంగా వస్తే, మరికొందరు ఫీల్డ్ విజిట్ పేరుతో మధ్యాహ్నం తర్వాత సచివాలయాల్లో కనిపించడం లేదు. రీగ్రూపింగ్‌లో భాగంగా కూటమి ప్రభుత్వం పర్యవేక్షణ కోసం ఇప్పటికే డిప్యూటీ ఎంపీడీవోలను నియమించింది. జిల్లాలో గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు, సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ ఎంపీడీవోలుగా ప్రమోషన్లు ఇచ్చింది. మండలానికొకర్ని నియమించింది.
ఇక సమయపాలన పాటించకతప్పదు
ఇక నుంచి సచివాలయ ఉద్యోగులు ఉదయం 11గంటల లోగా ఒకసారి, సాయంత్రం 5 గంటల తర్వాత ఒకసారి బయోమెట్రిక్ హాజరువేసేలా ఆదేశాలు వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయ హాజరు యాప్‌ను ఈ మేరకు అప్‌డేట్ చేశారు. అలా బయోమెట్రిక్ వేయకుంటే ఆ రోజు వారు విధులకు హాజరు కానట్లు ఆన్‌లైన్‌లో ఎంటరవుతుంది.
సెలవులకు వెసులుబాటు
ఇప్పటివరకు సచివాలయ ఉద్యోగులు సెలవు కోసం డీడీవోల వద్ద లీవ్ లెటర్‌తో అప్లై చేయాల్సి ఉండేది. ఆ విషయంలో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం కాస్త వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి సెలవు కావాల్సినవాళ్లు ఆన్‌లైన్‌లోనే (హెచ్‌ఆర్‌ఎంఎ్‌స పోర్టల్) దరఖాస్తు చేసుకునేలా, వాటిని డీడీవోలు ఆమోదించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 12వ తేదీన సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. దీన్ని వందశాతం అమలు చేసేలా కలెక్టర్, గ్రామ సచివాలయ పర్యవేక్షక అధికారులు చూడాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.