Share News

రెచ్చిపోతున్న ‘ఎర్ర’ స్మగ్లర్లు

ABN , Publish Date - Sep 14 , 2026 | 01:46 AM

ఎర్రచందనం అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అడ్డొచ్చే అధికారుల వాహనాలనూ ఢీకొంటూ వెళుతున్నారు. ఇలా శనివారం రాత్రి రెండు వాహనాలను ఢీకొనడంతో ఓ అధికారి కాలు విరిగింది. మరో ఇద్దరు గాయపడ్డారు. ఆయా దాడుల్లో స్మగ్లర్ల కారూ దెబ్బతింది. పట్టుబడ్డ ఇద్దరు స్మగ్లర్లకూ గాయాలయ్యాయి. గతంలోనూ ఇలాగే చేశారు.

రెచ్చిపోతున్న ‘ఎర్ర’ స్మగ్లర్లు
దెబ్బతిన్న ఫారెస్టు అధికారుల కారు

మొన్న కల్లూరులో కారు టైరు ఊడినా ఆపలేదు

తాజాగా రెండు వాహనాలకు ఢీ ఫ అంతంత మాత్రపు సౌకర్యాలతో సిబ్బంది అవస్థలు

పుంగనూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అడ్డొచ్చే అధికారుల వాహనాలనూ ఢీకొంటూ వెళుతున్నారు. ఇలా శనివారం రాత్రి రెండు వాహనాలను ఢీకొనడంతో ఓ అధికారి కాలు విరిగింది. మరో ఇద్దరు గాయపడ్డారు. ఆయా దాడుల్లో స్మగ్లర్ల కారూ దెబ్బతింది. పట్టుబడ్డ ఇద్దరు స్మగ్లర్లకూ గాయాలయ్యాయి. గతంలోనూ ఇలాగే చేశారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల క్రాసు సమీపంలోని పులిచెర్ల రోడ్లులో శనివారం రాత్రి ఎర్రచందనం స్మగ్లర్లు కారులో వస్తూ అడ్డుకోబోయిన పీలేరు ఫారెస్ట్‌ రేంజర్‌ చంద్రశేఖర్‌రెడ్డి వాహనాన్ని తొలుత ఢీకొన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత ఫారెస్ట్‌ అధికారులు వెంబడించడం.. వీరికి ఎదురుగా పులిచెర్ల నుంచి ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ కె.ప్రకాశ్‌కుమార్‌, బీట్‌ ఆఫీసర్లు ప్రతాప్‌, రెడ్డి ప్రసాద్‌ స్మగ్లర్లను పట్టుకోవడానికి వేచి ఉన్నారు. ఎర్రచందనం దుంగలున్న కారును తమిళనాడులోని విల్లుపురానికి చెందిన డ్రైవర్‌ బాలకృష్ణ అతివేగంగా నడుపుతూ.. వీరి కారును ఢీకొన్నాడు. ప్రకాశ్‌కుమార్‌ ఎగిరి పక్కకు పడటంతో తీవ్ర గాయాలతో కాలు విరిగింది. స్మగ్లర్ల వాహనానికి మాత్రం ఎయిర్‌ బెలూన్లు తెరవడంతో ప్రాణాపాయం జరగలేదు. ఫారెస్టు అధికారి ప్రతాప్‌ గాయపడ్డారు. కారులోని స్మగ్లర్లు బాలకృష్ణ, రాజేంద్రన్‌ను పట్టుకోగా, మరొకరిని పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది బాలాజీని కొరికి పరారయ్యాడు. మొత్తం ముగ్గురు స్మగ్లర్లు పరారు కాగా, గాయపడిన ఇద్దరిని అధికారులు పట్టుకున్నారు. స్మగ్లర్ల వాహనాన్ని సీజ్‌చేసి కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి రొంపిచెర్ల పోలీసులకు రేంజర్‌ చంద్రశేఖర్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తీవ్రంగా స్పందించారు. గాయపడిన అధికారులకు మెరుగైన వైద్యం చేయించాలని, దీనికయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

3న కల్లూరు ఘాట్‌లో..

ఎర్రచందనం రవాణాపై పీలేరు ఎంజేఆర్‌ కాలేజీ వద్ద బీట్‌ ఆఫీసర్లు ప్రతాప్‌, రెడ్డిప్రసాద్‌ ఈనెల 3వ తేదీ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. వేగంగా వచ్చిన ఓ కారు నిలపకుండా వెళ్లింది. స్మగ్లరును వెంబడిస్తూ ఫారెస్ట్‌ అధికారులు చేజింగ్‌ చేసినా ఆపలేదు. టైరు ఊడిపోయినా డిస్క్‌ పైనే 15 కిలోమీటర్లు నడిపి పులిచెర్ల మండలం కల్లూరు ఘాట్‌లో కారును వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు.

సమస్యలతో సతమతం

అటవీ సంపదను కాపాడుతున్న ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బందికి తగిన సౌకర్యాలులేక సతమతమవుతున్నారు. పీలేరు డీఎ్‌ఫవోకు వాహనం ఉండగా మిగిలిన వారికి దాడులకు వెళ్లేందుకు సరైన వాహనాలు లేవు. ప్రాణ రక్షణకు తుపాకీలు కూడా లేకపోగా స్మగ్లర్ల వద్ద గొడ్డళ్లు, కొడవలి తదితర ఆయుధాలుంటాయి. ఫారె్‌స్టశాఖ సిబ్బంది తక్కువగా ఉన్నారు.

పీసీ గణేశ్‌ను వాహనంతో ఢీకొట్టి చంపేశారు

గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన గణేశ్‌ను స్మగ్లర్లు వాహనంతో ఢీకొట్టి చంపేశారు. కేవీపల్లె మండలం చీనేపల్లె గొల్లపల్లి వద్ద ఈయన ఎర్రచందనం స్మగర్ల వాహనాన్ని ఆపుతుండగా ఢీ కొట్టారు. ఇలా అధికారుల ప్రాణాలూ తీసేందుకు వెనకాడని స్మగ్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Sep 14 , 2026 | 01:46 AM