రూ.1.65కోట్ల ఎర్రచందనం స్వాధీనం
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:12 AM
స్మగ్లర్లు ఎంతో తెలివిగా ట్రాక్టర్‌కు అమర్చిన వాటర్ ట్యాంకులో రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన రూ.1.65కోట్ల విలువైన 72 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు అంతరాష్ట్ర స్మగ్లర్లను, ఇద్దరు చిత్తూరు జిల్లా వాసులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ, టాస్క్‌ఫోర్సు హెడ్ సుబ్బరాయుడు తెలిపారు.
నలుగురు స్మగ్లర్ల అరెస్టు
టాస్క్‌ఫోర్సు హెడ్ సుబ్బరాయుడు వెల్లడి
తిరుపతి(కపిలతీర్థం), ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): స్మగ్లర్లు ఎంతో తెలివిగా ట్రాక్టర్‌కు అమర్చిన వాటర్ ట్యాంకులో రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన రూ.1.65కోట్ల విలువైన 72 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు అంతరాష్ట్ర స్మగ్లర్లను, ఇద్దరు చిత్తూరు జిల్లా వాసులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ, టాస్క్‌ఫోర్సు హెడ్ సుబ్బరాయుడు తెలిపారు. బుధవారం తిరుపతిలోని కపిలతీర్థం వద్ద గల టాస్క్‌ఫోర్సు కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లె మండలం పింఛా ప్రాజెక్టు సమీపంలో ఒక ట్రాక్టర్ ట్రాలీలో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. నలుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారు పారిపోయారన్నారు. ట్యాంకర్‌లో 72 ఎర్రచందనం దుంగలున్నట్లు గుర్తించారన్నారు. పట్టుబడ్డ వారిలో వేలూరు జిల్లాకు చెందిన ఇద్దరు స్మగ్లర్లు, చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు స్మగ్లర్లు ఉన్నారని తెలిపారు. ఈ అక్రమ రవాణా వెనుక ప్రధాన స్మగ్లర్లను అరెస్టుచేయడానికి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.స్మగ్లర్లను అరెస్టుచేయడంలో ప్రతిభచూపిన టాస్క్‌ఫోర్సు సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.టాస్క్‌ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్, ఏఎస్పీ కులశేఖర్, డీఎస్పీలు పాల్గొన్నారు.