భారీ సంఖ్యలో ఫోన్ల రికవరీ
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:39 AM
ఒకటీ రెండూ కాదు ఏకంగా 500కి పైగా చోరీ అయిన ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఎస్పీ తుషార్ డూడీ పోలీసు అతిథిగృహంలో బుధవారం మీడియాకు ఇందుకు సంబంధించి వివరించారు.
బాధితులకు అప్పగించిన ఎస్పీ తుషార్ డూడీ
చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ఒకటీ రెండూ కాదు ఏకంగా 500కి పైగా చోరీ అయిన ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఎస్పీ తుషార్ డూడీ పోలీసు అతిథిగృహంలో బుధవారం మీడియాకు ఇందుకు సంబంధించి వివరించారు. గడచిన రెండేళ్లకు ముందు చాలామంది ఫోన్లను పోగొట్టుకున్నారు. వారంతా తమ ఫోన్ల చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల పూర్తి సమాచారాన్ని సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. దీంతో టెక్నికల్ సిబ్బంది మొబైల్ ట్రాకింగ్ ద్వారా బాధితుల ఫోన్లు ఎక్కడున్నాయో గుర్తించారు. రూ.1.20 కోట్ల విలువ చేసే 501 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. జిల్లాకు చెందిన వారే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలకు చెందిన వారి మొబైల్‌ఫోన్లనూ రికవరీ చేయగలిగారు. ఫోన్ కోసం ఇతర రాష్ర్టాల నుంచి రాలేని వారికి ప్రత్యేకంగా కొరియర్ ద్వారా చేర్చుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎవరైనా ఫోన్లను పోగొట్టుకుంటే నేరుగా సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. 2023 నుంచి సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 14 దశల్లో దొంగతనాలకు గురైన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు.