రికార్డు స్థాయిలో అంతరాలయ దర్శనాలు
ABN , Publish Date - Jan 18 , 2026 | 01:22 AM
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం రికార్డు స్థాయిలో అంతరాలయ దర్శనాల టికెట్లు విక్రయాలు జరిగాయి.
శ్రీకాళహస్తి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం రికార్డు స్థాయిలో అంతరాలయ దర్శనాల టికెట్లు విక్రయాలు జరిగాయి. ముక్కంటి ఆలయంలో స్వామి అమ్మవార్లను మొదటి గడప నుంచి దర్శించుకునేందుకు భక్తులు ఎంతగానో ఇష్టపడతారు. గత వైసీపీ పాలనలో దళారులు, రాజకీయ సిఫార్సులతో మాత్రమే అంతరాలయ దర్శనాలు జరిగేవి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భక్తులందరికీ పారదర్శకంగా అంతరాలయ దర్శనం కలిగేలా టికెట్టు రూ.500 అందుబాటులోకి తెచ్చారు. దళారులతో సంబంధం లేకుండా భక్తులు సులభంగా దర్శనం చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజురోజుకూ అంతరాలయ టికెట్ల విక్రయాలు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజు 812 టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు ఆలయాధికారులు తెలిపారు. కాగా వరుస సెలవుల నేపథ్యంలో ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. వేకువజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. సుమారు 30 వేల మంది స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.