ట్రావెల్స్ బస్సుల దూకుడు
ABN , Publish Date - Aug 12 , 2026 | 01:55 AM
ప్రైవేట్ బస్సుల వేగానికి హద్దూపద్దూ ఉండడంలేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా డ్రైవర్ల దూకుడు తగ్గడంలేదు. తాజాగా రెండు బస్సుల అతివేగం ఓజిలి మండలం పెద్దపరియ క్రాస్ రోడ్డుకు సమీపాన అలజడి సృష్టించింది. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.పోలీసుల కథనం మేరకు.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి విజయవాడకు శ్యామోలి, ఇంటర్‌సిటీ స్మార్ట్ బస్ ట్రావెల్స్ సర్వీసులు ఒకదాని వెంట మరొకటి అత్యంత వేగంతో దూసుకుపోతూ పెద్దపరియ క్రాస్ రోడ్డు దాటాక ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపు తప్పాయి.బస్సులు రెండూ ఒకదాన్నొకటి రాసుకుంటూ వెళ్లి రహదారి పక్కన సూచిక బోర్డు స్తంభాన్ని ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా తిరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు హడలిపోయారు.
ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం
డ్రైవర్ల అతివేగంతో హైవేలో ట్రాఫిక్ జామ్
అదే సమయాన కారును ఢీకొన్న మరో లారీ
ఓజిలి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ బస్సుల వేగానికి హద్దూపద్దూ ఉండడంలేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా డ్రైవర్ల దూకుడు తగ్గడంలేదు. తాజాగా రెండు బస్సుల అతివేగం ఓజిలి మండలం పెద్దపరియ క్రాస్ రోడ్డుకు సమీపాన అలజడి సృష్టించింది. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.పోలీసుల కథనం మేరకు.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి విజయవాడకు శ్యామోలి, ఇంటర్‌సిటీ స్మార్ట్ బస్ ట్రావెల్స్ సర్వీసులు ఒకదాని వెంట మరొకటి అత్యంత వేగంతో దూసుకుపోతూ పెద్దపరియ క్రాస్ రోడ్డు దాటాక ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపు తప్పాయి.బస్సులు రెండూ ఒకదాన్నొకటి రాసుకుంటూ వెళ్లి రహదారి పక్కన సూచిక బోర్డు స్తంభాన్ని ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా తిరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు హడలిపోయారు. ఆ మార్గంలో వాహనాలు స్టేడియం వరకు నిలిచిపోయాయి. బస్సుల్లో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
వర్షం వల్ల తప్పిన ముప్పు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాసుకుంటూ ఆగిన సమయంలో వర్షం పడడం వల్ల పెనుముప్పు తప్పిందని భావిస్తున్నారు. లేకుంటే బస్సుల రాపిడికి మంటలు చెలరేగేవి. రెండు బస్సులకు అంటుకుని పెద్ద ప్రమాదం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కారును ఢీకొన్న లారీ
బస్సుల ప్రమాద ఘటన సమయంలోనే కొద్ది దూరంలో తిరుపతి నుంచి తెలంగాణాకు ఎనిమిది మంది పెద్దలు, ముగ్గురు పిల్లలతో వెళ్తున్న కారును బొగ్గు లోడు లారీ ఢీకొట్టింది. కారు వెనుక భాగం బాగా దెబ్బతింది. ఢీకొన్న ధాటికి కారు ముందున్న మరో లారీ కిందకు దూరిపోయింది.దీంతో కారులోని ఒక వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.మిగిలిన వారికి రక్తగాయాలయ్యాయి. వీరిని పోలీసులు గూడూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రోడ్డుకు అడ్డంగా తిరిగిన బస్సులను క్రేన్ సాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.