కుప్పం టీడీపీలో ‘రెబల్’ పోరు!
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:41 AM
పార్టీ ఒక అభ్యర్థిని ప్రకటిస్తుంది. ‘స్థానిక’ నేత మరో వ్యక్తిని రంగంలో దింపుతాడు. తప్పుకోమంటుంది నాయకత్వం. ససేమిరా అంటుంది రెబల్ తత్వం. కొన్నిచోట్ల అభ్యర్థుల ‘ఎంపిక’లో చేసిన పొరపాట్లు ఇప్పుడు లెక్కకుమిక్కిలి రెబల్ అభ్యర్థులుగా మారి టీడీపీకి తలనొప్పిగా మారాయి. ఉపసంహరణలకోసం చేస్తున్న ప్రయత్నాలు జోరందుకున్నా.. ఫలితాలు మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి. ‘
‘స్థానిక’ నేతల లోపాయికారీ మద్దతు
ఉపసంహరణల ప్రయత్నాలు జోరు
కుప్పం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఒక అభ్యర్థిని ప్రకటిస్తుంది. ‘స్థానిక’ నేత మరో వ్యక్తిని రంగంలో దింపుతాడు. తప్పుకోమంటుంది నాయకత్వం. ససేమిరా అంటుంది రెబల్ తత్వం. కొన్నిచోట్ల అభ్యర్థుల ‘ఎంపిక’లో చేసిన పొరపాట్లు ఇప్పుడు లెక్కకుమిక్కిలి రెబల్ అభ్యర్థులుగా మారి టీడీపీకి తలనొప్పిగా మారాయి. ఉపసంహరణలకోసం చేస్తున్న ప్రయత్నాలు జోరందుకున్నా.. ఫలితాలు మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి. ‘పంచాయతీ’ పోరులో ఎక్కడ ఏ రెబల్ అభ్యర్థి బరిలో మిగిలిపోయి విజయావకాశాలను దెబ్బతీస్తాడోనన్న ఆందోళన నియోజకవర్గ నాయకత్వంలో నెలకొంది.
కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకూ కలిపి మొత్తం 92 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. రామకుప్పం మండలం నాయనూరు ఎన్నిక కోర్టు వివాదాల వల్ల జరగడంలేదు. ఈ 92 గ్రామ పంచాయతీలకు కలిపి సర్పంచి స్థానాలకు 784 నామినేషన్లు దాఖలయ్యాయి. 92 పంచాయతీలలో 970 వార్డులుండగా, 1,851 నామినేషన్లు పడ్డాయి. బుధవారం జరిగిన ‘పరిశీలన’లో తిరస్కరణ, డబుల్ ఎంట్రీలు పోను నాలుగు మండలాలకూ కలిపి సర్పంచ్ స్థానాలకు 557.. వార్డులకు 1,779 నామినేషన్లు అర్హత సాధించాయి. గ్రామస్థాయి పోరు కావడంతో ఎక్కడా ఎవరూ తగ్గలేదు. మనమూ ఒకటేస్తే పోలా.. అన్న రీతిలో గ్రామస్థాయి పార్టీ కార్యకర్తలు నామినేషన్లు వేసేయగా, స్వతంత్రులుగా తామూ పోటీలో ఉంటామంటూ మరికొందరు వేసి ఊరుకున్నారు. పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల్లో కొందరికి స్థానికంగా బలం లేకపోవడం, పంచాయతీ స్థాయిలో చర్చకు వచ్చింది. దీంతో బలం ఉందనుకుంటున్న అభ్యర్థులు తెగించి నామినేషన్లు వేసేశారు. మరోవైపు కొందరు ‘స్థానిక’ నేతలు రెబల్ అభ్యర్థులకు లోపాయికారీ మద్దతు ఇవ్వడంవల్ల కూడా వారి బెడద పెరిగింది. నియోజకవర్గ నాయకత్వానికి- మండల, పంచాయతీ స్థాయి నాయకత్వానికి సమన్వయం లోపించిన చోట ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది.
‘పరిషత్’ అనుభవం నేర్పించని పాఠం
ఇటీవలే జరిగిన ‘పరిషత్’.. అంతకుముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార టీడీపీ అభ్యర్థులనుంచీ ఇదేరీతిలో నామినేషన్లు రికార్డు స్థాయిలో పడ్డాయి. సర్పంచులతో పోలిస్తే ఈ పదవులకు ఎటువంటి గుర్తింపు, సంపాదనా మార్గాలు లేకపోయినా చోటా నేతలు, చివరికి సామాన్య కార్యకర్తలు కూడా పొలోమంటూ నామినేషన్లు వేసేశారు. నియోజకవర్గ నాయకత్వం ముందస్తు కసరత్తు జరపకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నామినేషన్లు వేసిన రెబల్ అభ్యర్థులను బరినుంచి తప్పించడానికి అప్పట్లో నాయకత్వం తలప్రాణం తోకకొచ్చింది. నామినేషన్ల ఉపసంహరణల గడువు ముగిసే చివరి క్షణం దాకా ఈ ప్రయత్నాలు జరుగుతూనే వచ్చాయి. చివరకు కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డులో మొండిగా ఇండిపెండెంటుగా మిగిలిపోయిన రెబల్ అభ్యర్థికి, పార్టీ టికెట్టు ఇచ్చిన అభ్యర్థి మద్దతు ప్రకటించి పక్కకు తప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇండిపెండెంట్ అభ్యర్థే గెలిచారిక్కడ. ఇవన్నీ చూసినా.. సర్పంచి స్థానాలలో తొలుతే రెబల్స్‌ను నియంత్రించడంలో నాయకత్వ తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. లెక్కకు మిక్కిలిగా వెల్లువెత్తిన నామినేషన్లే దీనికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడు ఒక పదవికి, అందులోనూ అన్ని హంగులూ కలిగిన సర్పంచికి పోటీ ఎక్కువగా ఉండడం సహజమే. అవసరమైనప్పుడు ఏకాభిప్రాయాన్ని సాధించాలని, అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే సామర్థ్యం ఉండాలని అధినేత చంద్రబాబు ఆశిస్తున్నారు. అయితే నాయకత్వంలో ఈ రెండు లక్షణాలు అవసరమైన స్థాయిలో కనిపించడంలేదని పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.
ఆఖరుదాకా ఇంతేనా?
ఒక్కో సర్పంచి స్థానానికి అధికార టీడీపీ నుంచి ముగ్గురు నలుగురు కూడా బరిలో ఉన్నారు. ఇప్పటికీ పార్టీలో అంతర్గత సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి మినహా మిగిలిన వారిని పక్కకు తప్పించడానికి బుజ్జగింపుల పర్వం నడిచింది. అయినా సరైన ఫలితం ఇవ్వలేదని సమాచారం. నామినేషన్ల ఉపసంహరణకు ఇక మిగిలింది రెండు రోజులే. ఆలోగా పార్టీనుంచి ఒక్కొక్కరే రంగంలో ఉండితీరేలా నాయకత్వం కచ్చితంగా ప్రయత్నించాల్సి ఉంది. లేదంటే బరిలో మిగిలిపోయిన రెబల్ అభ్యర్థులు, ఒకట్రెండు చోట్ల పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థి విజయావకాశాలను దెబ్బ తీసే ప్రమాదం ఉంది.
‘గుర్తు’ పెట్టుకోండి
పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయి. బ్యాలెట్ పేపర్లో పార్టీ గుర్తులు ఉండవు. అంటే పార్టీ మద్దతు ప్రకటించినా సరే, అధికారులు కేటాయించిన ఏదో గుర్తుపైనే పోటీ చేయాలి. ఇక, పల్లెల్లో ఎన్నిక కాబట్టి, బరిలో ఉన్న వారి వ్యక్తిగత సంబంధాలు, బంధుమిత్ర గణాలు, కులాల సమీకరణలు విజయావకాశాలపై ప్రభావం చూపుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మద్దతిచ్చిన వారే పోటీలో ఉండేలా.. ఇతరులను ఒప్పించి పక్కకు తప్పించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.