Share News

తోడు కోల్పోయినవారికి భరోసా

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:26 AM

జిల్లాలో ఇప్పటికే 60 వేల మందికి వితంతు పింఛన్లు , వేచి ఉన్న మరో 4 వేల మంది అర్హులు

 తోడు కోల్పోయినవారికి భరోసా

చిత్తూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ రూ.4 వేలకు పెంచింది. మూడు నెలల అరియర్స్‌తో పాటు పంపిణీ చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పెద్ద మొత్తంలో పంపిణీ చేస్తోంది. కానీ, కొత్త పెన్షన్ల మంజూరులో ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. వచ్చే జూన్‌లో ప్రభుత్వం ఏర్పడి మూడో ఏడాదిలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలుత వితంతువులకు, తర్వాత దివ్యాంగులకు మంజూరు చేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో వేచి చూస్తున్న సుమారు 4 వేల మంది వితంతువులకు లబ్ధి కలగనుంది.

జిల్లాలో 2,31,543 మందికి నెలకు రూ.98.12 కోట్లతో 16 రకాల పెన్షన్లను అందిస్తున్నారు. అలాగే 2102 మందికి నెలకు రూ.2.71 కోట్లతో 11 రకాల హెల్త్‌ (రోగులు) పెన్షన్లను కూడా పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా 233,645 మందికి రూ.100.83 కోట్లు ప్రతి నెలా అందిస్తున్నారు. మొత్తం పెన్షన్లలో వృద్ధాప్య 49శాతం, వితంతువులకు 25.7 శాతం, దివ్యాంగులకు 13.5 శాతంగా ఉన్నాయి. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్య నియోజకవర్గం కుప్పంలో మాత్రం కొత్త పెన్షన్లు ఇచ్చారు. కుప్పం మున్సిపాలిటీ సహా నాలుగు మండలాల్లో తొలుత 3600 పెన్షన్లు మంజూరవ్వగా.. రెండో విడతలో 1047 దివ్యాంగ పెన్షన్లు మంజూరయ్యాయి. ఆయా పెన్షన్లను సీఎం చంద్రబాబు తన పర్యటనలో స్వయంగా పంపిణీ చేశారు. ఇక, జిల్లాలో 15 వేల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కో మండలంలో కనీసం 400 మంది, మున్సిపాలిటీల్లో వెయ్యి మంది వరకు అర్హులు ఉంటారని ప్రాథమిక అంచనా. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. దరఖాస్తు అవకాశాన్ని కల్పిస్తే ఆ సంఖ్యలో స్పష్టత వస్తుంది. పెరిగే అవకాశాలూ ఉన్నాయి.

స్పౌజ్‌ కేటగిరీలో 2 వేల పెన్షన్లు

గతేడాది అక్టోబరు నుంచి ప్రభుత్వం స్పౌజ్‌ కేటగిరీ కింద ఏ నెలకు ఆ నెల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తోంది. పెన్షన్‌ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పెన్షన్‌ను మరుసటి నెలలోనే భార్య పేరు మీదకు మారుస్తోంది. ఆ కుటుంబం అప్పటివరకు పెన్షన్‌ ఆసరా కోల్పోకుండా చేయూతనిస్తోంది. మన జిల్లాలో ఆరు నెలలకుగానూ 2058 మంది మహిళలకు స్పౌజ్‌ కేటగిరీ కింద పెన్షన్లు మంజూరు చేశారు.

కొత్త పింఛన్ల కోసం..

కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లవుతున్నా కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ వంటి పెన్షన్లు మంజూరు చేయకపోవడంతో క్షేత్ర స్థాయి టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో అప్పటి వలంటీర్లు సిద్ధం చేసిన జాబితా మేరకే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని.. అప్పట్లో అర్హులైన టీడీపీ సానుభూతిపరుల పేర్లను జాబితాలో చేర్చకుండా మొండిచేయి చూపారని వాపోతున్నారు. క్షేత్ర స్థాయిలో జాబితాను సవరించి అర్హుల్ని జాబితాలో చేర్చాలని కోరుతున్నారు. ఇక, కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్‌ఎ్‌సలో పెన్షన్ల కోసమే పెద్దఎత్తున అర్జీలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలకూ పర్యటనల్లో వచ్చే అర్జీల్లో ఇవే ఎక్కువ.

Updated Date - Apr 24 , 2026 | 12:26 AM